షూటింగ్ పూర్తిచేసికున్న రజనీ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ పరంపరలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాయి. అయితే ‘పేట’ చిత్రం హిట్‌ అవడంతో తలైవాకు మంచి బూస్ట్‌ దొరికింది. ఆ సక్సెస్‌ హుషారును కొనసాగించడానికి దర్బారు చిత్రంతో సిద్ధం అవుతున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్‌.మురుగదాస్‌ తెరకెక్కించారు. ‘పేట’కు సంగీతాన్ని సమకూర్చిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికీ పని చేస్తున్నారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్న రజనీ రఫ్ఫాడిస్తారని అభిమానులు అంటున్నారు.

దర్బార్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో రజనీకాంత్‌ స్టైల్‌ అద్భుతంగా ఉందని ప్రశంసలు వెల్లువెత్తాయి. మరి పోస్టర్‌నే ఇంత ఆసక్తికరంగా మలిచారంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అని అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. కాగా దర్బార్‌ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ మేరకు చిత్ర యూనిట్‌ ట్వీట్‌ చేసిన ఫొటోను బీఆర్‌ రాజు నెటిజన్లతో పంచుకున్నాడు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల మందుకు రానుంది.