భారీ బడ్జెట్‌తో 3డీ సినిమా చేయనున్న అల్లు అరవింద్

టాలీవుడ్‌లో మరో భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామాయణ గాథను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో 3డీ రూపంలో తెరకెక్కించేందుకు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. ఈ మేరకు రామాయణ చిత్రంపై అధికారికంగా ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా 3డీ రూపంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలుగుతోపాటు హిందీ, తమిళంలోనూ విడుదల కానున్న ఈ చిత్రాన్ని మధు మంతెన, నమిత్ మల్హోత్రాతో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ‘దంగల్’ ఫేం నితీశ్ తివారీ, ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తొలిభాగం 2021లో విడుదల కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు, సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.