అమితాబ్‌ తొలి తమిళ సినిమా.. రమ్యకృష్ణకు జోడీగా!

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తన తొలి తమిళ చిత్రానికి సంతకం చేసేశారు. తమిళ్‌వాణన్‌ తెరకెక్కిస్తున్న ‘ఉయర్నత మణిదాన్‌’ అనే చిత్రంలో బిగ్‌బి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలోని తన లుక్‌ను అమితాబ్‌ ఇటీవల విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌.జే సూర్య కూడా ట్విటర్‌ వేదికగా అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. ‘నా జీవితంలోనే ఆనందకరమైన క్షణం. నేనెప్పుడూ కనని కల నెరవేరింది. అమితాబ్‌ సర్‌తో కలిసి పనిచేస్తున్నాను. అందుకు దేవుడికి, అమ్మానాన్నలకు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు, ఏ.ఆర్‌ మురుగదాస్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమా నాకు దక్కేలా చేసింది మురుగదాస్‌ సర్‌.. సినిమాను ప్రకటించింది రజనీ సర్‌.. అందుకే వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను’ అని పేర్కొన్నారు. ఇందులో సూర్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాలో అమితాబ్‌కు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. తమిళం, హిందీలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం అమితాబ్‌ 40 రోజుల కాల్‌షీట్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిగ్‌బి ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఝండ్‌’, ‘బ్రహ్మాస్త్ర’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాల్లో నటిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates