ఎన్టీఆర్ షోలో మాజీ హీరోయిన్లు!

త్వరలోనే ప్రారంభం కానున్న ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరనే విషయంపై అందరిలో ఆసక్తి కలుగుతోంది. కావాలనే ఈ విషయాలను బయటకు లీక్ చేయకుండా అందరిలో ఆతురతను మరింత పెంచుతున్నారు కార్యనిర్వాహకులు. అయితే షోలో పాల్గొనే వారి గురించి ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే అనేక పేర్లు వినిపించాయి. నటుడు పోసాని కృష్ణమురలి పేరు కూడా వినిపించింది. కానీ ఆయన ఈ విషయాన్ని ఖండించారు. కె.ఎల్.పాల్, జలీల్ ఖాన్ వంటి వారి పేర్లు కూడా వినిపించాయి. సినిమా వాళ్ళ విషయానికొస్తే.. కొందరు మాజీ హీరోయిన్ల పేర్లు వినిపిస్తుండడం విశేషం. ఒకప్పడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన రంభ, స్నేహ, సద ఈ ముగ్గురు కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 
కొన్నేళ్ళ కిందట వివాహం చేసుకున్న రంభ ఆ తరువాత విడాకుల వ్యవహారం, మళ్ళీ తిరిగి భర్తతో కలుసుకోవడం వంటి వ్యవహారాలతో కోర్టు చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో ఆమెను బిగ్ బాస్ షోలోకి తీసుకున్నారని సమాచారం. స్నేహ వివాహం చేసుకొని అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నారు. సదాకి కూడా సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు మంచు లక్ష్మి పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ విషయంపై బిగ్ బాస్ యూనిట్ ఎలా స్పందిస్తుందో.. చూడాలి!