వైసీపీలో చేరనున్న శివాజీరాజా!

ప్రముఖ సినీనటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా.. రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. ఆయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… నర్సాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనుండడంతో… ఈ సందర్భంగా శివాజీ రాజా… వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందంటున్నారు. తాజాగా జరిగిన ‘మా’ ఎన్నికల సందర్భంగా మెగాబ్రదర్ నాగబాబు… శివాజీ రాజా మధ్య విబేధాలు చోటుచేసుకున్నాయనే చర్చ జరిగింది. ఎన్నికల ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన శివాజీ రాజా.. నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించడం కూడా చర్చకు దారితీసింది. అయితే, జనసేన తరపున నర్సాపురం నుంచి నాగబాబు పోటీకి దిగుతుండడంతో శివాజీ రాజాను ఆయనకు వ్యతిరేకంగా ఉపయోగించేకోవాలనే యోచనలో వైసీపీ అధినేత ఉన్నట్టుగా సమాచారం. నర్సాపురం వైసీపీ అభ్యర్థి రఘురామరాజు తరపున శివాజీ రాజా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. రాజుల కమ్యూనిటీ నుంచి ఆయన మద్దతు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.