రాజకీయాల్లోకి రానంటున్న స్టార్ హీరో!

తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏ మాత్రం లేదని శాండల్‌వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పష్టం చేశారు. కన్నడలో రాజ్ కుమార్ ఫ్యామిలీ అంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లెజండరీ స్టార్ రాజ్ కుమార్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు శివరాజ్ కుమార్. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ తన ప్రస్థానాన్ని సాగిస్తున్నారు శివరాజ్ కుమార్. అయితే ఈయన రాజకీయాల్లోకి రానున్నట్లుగా ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల బెంగుళూరు వచ్చి శివరాజ్ కుమార్ తో భేటీ అయ్యారు. శివరాజ్ కుమార్ ఇంటికి రాహుల్ గాంధీ వెళ్ళడంతో శివన్న రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ.. ఊహాగానాలు మొదలయ్యాయి. 
అయితే రాహుల్ తన ఇంటికి రావడం పట్ల ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని శివరాజ్ కుమార్ స్పష్టం చేశాడు. ఇటీవలే రాజ్ కుమార్ సతీమణి, శివరాజ్ కుమార్ తల్లి పార్వతమ్మ మరణించారు. ఈ క్రమంలో శివరాజ్ కుమార్ ను పరామర్శించడానికే రాహుల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. శివరాజ్ కుమార్ కూడా ఈ విషయాన్నే స్పష్టం చేశారు. రాహుల్ కేవలం పరామర్శించడానికే వచ్చినట్లుగా ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని వెల్లడించారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశం పట్ల వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలే అని తేలిపోయింది.