అభిమానికి వార్నింగ్‌ ఇచ్చిన రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి ఉన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను దేవుడిలా ఆరాధించే వారున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే ఆయన హిమాలయాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి తిరిగి శుక్రవారం అర్ధరాత్రి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులందరూ ఒక్కసారిగా వచ్చి ఆయనను చుట్టు ముట్టారు. ఆయనతో ఫొటోల కోసం ఎగబడ్డారు. వారందరికీ నవ్వుతూ సమాధానం చెబుతూ అక్కడి నుంచి రజనీ తన నివాసానికి వెళ్లడానికి కారెక్కారు.

ఇంతలో ఓ అభిమాని తన బైక్‌లో రజనీ కార్‌ను ఫాలో అయ్యారు. అలా సూపర్‌స్టార్‌ ఇంటివరకు ఆ వ్యక్తి వెళ్లాడు. దీన్ని గమనించిన రజనీ తన ఇంటి గేట్‌ వాచ్‌మెన్‌ ద్వారా ఆ అభిమానిని ఇంట్లోకి పిలిపించారు. ‘ఇలాంటి సమయంలో బైక్‌పై ప్రయాణం మంచిది కాదు. చాలా ప్రమాదకరమైంది. ఇంకెప్పుడూ ఇలా చెయ్యొద్దు’ అని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చి ఒక ఫొటో దిగి పంపారు.

‘#WelcomeBackThalaiva’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉండగా సదరు అభిమాని ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం రజనీ ‘దర్బార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.