రానా సినిమా నుంచి తప్పుకున్న టబు!

నటుడు రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘విరాటపర్వం’. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటి టబు మానవ హక్కుల పోరాట నాయకురాలిగా కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు గుసగుసలు వినిపస్తున్నాయి. చేతి నిండా ఉన్న ప్రాజెక్టుల కారణంగా డేట్లు సర్దుబాటు కాకపోవడంతో టబు ఈ సినిమా నుంచి తప్పుకుంటోందట. ఆమె స్థానంలో బాలీవుడ్‌ నటి నందితా దాస్‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి‌. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

మరోవైపు స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న చిత్రంలో టబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న వీడియోను చిత్ర బృందం ఇటీవల ట్విటర్‌లో పంచుకుంది. తెలుగు సినిమాలతో పాటు పలు బాలీవుడ్‌ చిత్రాల్లో టబు బిజీగా ఉన్నారు.