మీటూ ఫిర్యాదుతో అవకాశాలు దూరం: తమన్నా

నటి తమన్నా.. మీటూతో అవకాశాలు బంద్‌ అని పేర్కొంది. మీటూ అనేది ముందుగా హాలీవుడ్‌లో మొదలై, ఆ తరువాత మన దేశంలో వ్యాపించింది. అదీ బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించి ఆపై దక్షిణాదిలో కలకలానికి దారి తీసింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో మీటూ చాలా ఎఫెక్ట్‌ చూపించిందనే చెప్పాలి. ఇక్కడ సినీ ప్రముఖులను బయటకు ఈడ్చిందని చెప్పవచ్చు. ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుపై ప్రముఖ యువ గాయని, డబ్బింగ్‌ కళాకారిణి చిన్మయి చేసిన మీటూ ఆరోపణలు పెద్ద దుమారాన్నేలేపాయి. ఇక నటుడు, దర్శకుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్, దర్శకుడు సుశీగణేశ్, సీనియర్‌ నటుడు రాధారవి వంటి వారికి మీటూ ఆరోపణలు వదలలేదు. సంచలన నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ లాంటి వారు కూడా మీటూ సమస్యలను ఎదుర్కొన్నట్లు బహిరంగంగానే వెల్లడించారు. అయితే ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో నటి తమన్నా మూలంగా మరోసారి చర్చకు వచ్చింది.

ఇటీవల వరుస సక్సెస్‌లతో జోరు మీదున్న తమన్నా ఒక ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మీటూ ప్రస్తావన వచ్చింది. దీనికి ఈ మిల్కీబ్యూటీ బదులిస్తూ సహజసిద్ధంగా పని చేసుకుంటూ పోయే తనకు ఇంత వరకూ మీటూ సమస్య ఎదురవలేదని చెప్పింది. తాను ఎలా ప్రవర్తించాలో తనకు తెలుసు అని అంది. లైంగికపరమైన ఒత్తిడి రాకపోవడం తన అదృష్టం కూడా కావచ్చునని పేర్కొంది. అయితే అత్యాచార ఒత్తిళ్లు ఎదుర్కొన్న మహిళలు వాటి గురించి ధైర్యంగా మాట్లాడడం మంచిదేనంది. అయితే అలాంటి వారికి అవకాశాలు రాకపోవడం బాధగా ఉందని పేర్కొంది. ఏదైనా ఒక విషయం మిమ్మల్ని బాధిస్తోందని భావిస్తే దాన్ని ఎదిరించిపోరాడాలని అంది. అలా తాను కూర్చుని చింతించే అమ్మాయిని కాదని చెప్పింది. తాను ఇంతకాలం నటిగా నిలబడడానికి కారణం తాను అనుకున్నది చేయగలగడమేనని చెప్పింది. పలు శక్తివంతమైన, ఆత్మస్థైర్యంతో సాధిస్తున్న మహిళలు ఇప్పుడు ఉన్నారని తమన్నా అంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విశాల్‌తో నటించిన యాక్షన్‌ చిత్రం వచ్చే నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.