వైసీపీ దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోయింది: కోడెల

రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోయిందని టీడీపీ సీనియర్‌ నేత, శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో అవహేళనగా మాట్లాడటం సరికాదన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆదివారం మీడియాతో కోడెల మాట్లాడారు. ప్రజలు నమ్మకంతో బాధ్యతనిస్తే.. వారికి అభివృద్ధిని అందించాలే తప్ప ఇబ్బందులకు గురిచేయకూడదన్నారు. వైసీపీ నాయకులే దాడులు చేసి.. తిరిగి వాళ్లే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు ఇప్పటి వరకు సుమారు 400 కేసులు పెట్టారన్నారు. వైసీపీ దౌర్జన్యాలకు తాను కూడా బాధితుడినేనని కోడెల వ్యాఖ్యానించారు. అభూత కల్పనలు.. కక్ష సాధింపు చర్యలతో తన కుటుంబంపై ఇప్పటి వరకు 16 కేసులు నమోదు చేశారని చెప్పారు. తనకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్యుడి పరిస్థితేంటని కోడెల ప్రశ్నించారు. ఈ కేసులకు తాను భయపడబోనని, న్యాయపోరాటం చేస్తానన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేందుకు, ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని కోడెల చెప్పారు.