సరైన దుస్తులు ధరించండి ..నెటిజన్‌ ట్వీట్‌.. రష్మీ ఘాటు సమాధానం

సరైన దుస్తులు ధరించాలని నీతి పాఠాలు చెప్పిన ఓ నెటిజన్‌కు రష్మి ఘాటుగా బుద్ధి చెప్పారు. ఇటీవల బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా ఓ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం చీర కట్టుకుని ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అయితే ఆమె బ్లౌజ్‌ ధరించకుండా పోజిచ్చారు. దీనిపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. మరికొందరేమో.. భారతదేశంతో రవిక లేకుండా చీర ధరించే మహిళలు చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. ఈ మేరకు బాలీవుడ్‌లో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. పలు వెబ్‌సైట్లు ప్రియాంకకు మద్దతుగా కథనాలు కూడా రాశాయి. రవికలేని చీరకట్టు పూర్వకాలం నుంచి ఉందని ఓ వెబ్‌సైట్‌ రాసిన కథనాన్ని రష్మి రీ ట్వీట్‌ చేశారు. దీన్ని ఓ నెటిజన్‌ విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. ‘ఇలాంటివి ధరించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా.. ఇలాంటి వాటి వల్లే అమ్మాయిలు పొట్టి దుస్తులు ధరిస్తూ అత్యాచారాలకు గురి అవుతున్నారు. సరైన పొడవు దుస్తులు ధరిస్తే దాదాపు నేరాల్ని తగ్గించొచ్చు. దీని గురించి కాస్త ఆలోచించండి’ అంటూ రష్మి గౌతమ్‌ను ట్యాగ్‌చేశారు.

దీంతో ఆగ్రహించిన రష్మి అతడికి సమాధానం ఇచ్చారు. ‘ఇలాంటి ఆలోచనలు ఉన్న నువ్వు జన్మించడమే ఓ పెద్ద నేరం’ అని అన్నారు. దీనికి సదరు నెటిజన్‌ తన ట్వీట్‌ను డిలీట్‌ చేసేశారు. ‘మీకు నేను వ్యతిరేకం కాదు రష్మి గారు.. నేను నిజం చెబుతున్నా. కొన్ని సందర్భాల్లో నేరాలు ఇలా కూడా జరుగుతుంటాయి. మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి’ అని పేర్కొన్నారు.