సూపర్ స్టార్ పక్కన చెన్నై బ్యూటీ!

దక్షిణాది టాప్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ.. తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని రూపిస్తోంది. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రజినీకాంత్, పా.రంజిత్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘కబాలి’ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు కలిసి సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అమలాపాల్, నయనతార ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ చివరగా ఈ అవకాశం చెన్నై బ్యూటీ త్రిషను వరించిందని చెబుతున్నారు.

ఇటీవల త్రిష, ధనుష్ ద్విపాత్రాభినయం చేసి ‘కోడి’ అనే తమిళ చిత్రంలో నటించింది. ఈ సినిమా ‘ధర్మయోగి’ అనే పేరుతో తెలుగులో కూడా విడుదలయింది. ఈ సినిమాలో త్రిష నటన ధనుష్ ను విపరీతంగా ఆకట్టుకుందని.. ఆ కారణంగా రజినీకాంత్ సినిమాలో హీరోయిన్ గా ఆమెను సిఫార్సు చేశారని చెప్పుకుంటున్నారు. మొత్తానికి రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి అమ్మడు మరో మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి.