టీవీ నటుడు మధుప్రకాశ్‌ అరెస్టు

హైదరాబాద్‌లో టీవీ నటుడు మధుప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వరకట్నం వేధింపుల కేసులో అతడిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంలో గొడవల కారణంగా అతడి భార్య భారతి (34) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురిని వరకట్నం కోసం మధు ప్రకాశ్‌ వేధించినందువల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని, అతడిపై చర్యలు తీసుకోవాలని భారతి తల్లిదండ్రులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని బుధవారం అరెస్టు చేశారు. దీనిపై ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ పంచవటి కాలనీలో నివసించే టీవీ సీరియల్‌ నటుడు మధు ప్రకాష్‌కు గుంటూరుకు చెందిన భారతితో 2014లో వివాహం జరిగింది. పెళ్లయిన కొత్తలో వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగినా కాలక్రమేణా మధుప్రకాష్‌ ఆమెను వేధించడం ప్రారంభించాడు. షూటింగ్‌ల పేరుతో ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని భారతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.