వెంకీమామ దసరా కానుక

విక్టరీ హీరో వెంకటేష్‌, అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ వెంకీ మామ. తొలిసారిగా మామ అల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ మామూలుగా ఉండదని అర్థమైంది. కాగా, దసరా కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

టీజర్‌లో వెంకీ చెప్పిన పవర్‌ ఫుల్‌ డైలాగ్‌లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ‘గోదావరిలో ఈత నేర్పాను, బరిలో ఆట నేర్పాను.. ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు’ అంటూ వెంకటేష్‌ చెప్పిన డైలాగ్‌ టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందట. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు చివరి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందని తాజా సమాచారం. ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు.