మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ సర్‌ప్రైజ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో మహేష్‌ పాత్రను పరిచయం చేసిన చిత్ర బృందం.. తాజాగా స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి సేవ చేస్తూ త్యాగానికి మారుపేరైన భారత సైనికులకు ఘన నివాళిగా ఓ పాటతో కూడిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ సాగిన ఈ వీడియోలో 1971 ఇండో-పాక్‌ వార్‌, సియాచిన్‌ వివాదం, కార్గిల్‌ యుద్ధం, 2016 సర్జికల్‌ స్ట్రైక్స్‌ చిత్రాలను చూపించారు. ఆయా దృశ్యాలన్నీ రోమాంచితంగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో మహేష్‌ ఆర్మీ అధికారి మేజర్‌ అజయ్‌కృష్ణగా కనిపించనున్నారు. ‘సరిలేరు.. నీకెవ్వరూ..’ అంటూ వినిపించిన బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ అభిమానులను అలరిస్తోంది.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్‌ నటి విజయశాంతి, నటుడు బండ్ల గణేశ్‌లు ఈ చిత్రంతోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే సెట్‌లోకి అడుగుపెట్టారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్‌బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.