‘మన్మథుడు -2’ లో బ్రహ్మీ పాత్రలో ఈ హాస్యనటుడేనంట!

‘హలో.. ఐయామ్‌ లవంగం’ అంటూ ‘మన్మథుడు’ లో బ్రహ్మానందం పండించిన కామెడీ అంతాఇంతా కాదు. నాగార్జున, బ్రహ్మీకి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి. ఇప్పుడు ‘మన్మథుడు’ కి సీక్వెల్‌ రాబోతున్న సంగతి తెలిసింది. ఇటీవల షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్‌ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారు. ఏప్రిల్‌లో పోర్చుగల్‌లో మొదటి షెడ్యూల్‌ ప్రారంభం కాబోతోంది. ‘చి.ల.సౌ’ సినిమాతో దర్శకుడిగా మెప్పించిన నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై నాగార్జున, జెమిని కిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా ‘మన్మథుడు 2’ లో బ్రహ్మానందం స్థానాన్ని వెన్నెల కిశోర్‌ భర్తీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగ్‌తో కలిసి వెన్నెల సందడి చేయబోతున్నారట. వీరిద్దరి మధ్య వినోదాత్మక సన్నివేశాల్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కోసం నాగ్‌ కొత్త లుక్‌లో సిద్ధమౌతున్నారట.