HomeTelugu Big Storiesప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ కన్నుమూత

ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ కన్నుమూత

Vijayakanth passed away

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ (71) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణ వార్తతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు షాక్ కు గురవుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.

జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు తదితర సమస్యలతో గత నెలలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలోనే ఆయన చనిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కదలలేని స్థితిలో, చాలా బలహీనంగా కనిపించారు.

Vijayakanth passed away1

అయితే మరోసారి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఆసుపత్రిలో చేర్పించారు. అయనకు కరోనా సోకినట్టు ఈ ఉదయం వైద్య పరీక్షల్లో నిర్ధరాణ అయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచి, చికిత్సను కొనసాగించారు. అయితే, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి విషమించి కన్నుమూశారు.

విజయకాంత్‌ 1952 ఆగస్టు 25న మధురై (తమిళనాడు)లో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా మారారు. తల్లిదండ్రులు కె.ఎన్‌. అళగర్‌స్వామి, ఆండాళ్‌ అజగర్‌స్వామి. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్‌ ‘సగప్తం’, ‘మధుర వీరన్‌’ చిత్రాల్లో నటించారు.

విజయ్‌కాంత్‌ 27 ఏళ్ల వయసులో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన తొలి సినిమా ‘ఇనిక్కుమ్‌ ఇలమై’ ( (1979). విలన్‌గా ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారాయన. 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. కెరీర్‌ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్‌.. ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. ఆయన 150కి పైగా సినిమాల్లో నటించారు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. పోలీసు అధికారిగా 20కి పైగా సినిమాల్లో కనిపించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా ‘సగప్తం’ (2015).

vijaykanth

విజయకాంత్‌ తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా, ద్విపాత్రాభినయం చేయాలన్నా విజయకాంత్‌ అందరికంటే ముందుండేవారు. మరోవైపు కమర్షియల్‌ చిత్రాల్లోనూ సందడి చేసేవారు. ఇతరుల్లా కాకుండా ఆయన పారితోషికాన్ని ముందుగా తీసుకునేవారుకాదట. తనతో సినిమా నిర్మించే నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యునరేషన్‌ తీసుకునేవారు కాదట.

తన బావ ఎల్‌.కె. సుధీశ్‌తో కలిసి ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు. 1994లో ‘తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్‌ పురస్కారం), 2001లో ‘కళైమామణి అవార్డు’ (తమిళనాడు ప్రభుత్వం) అందుకున్నారు. 2001లో ‘బెస్ట్‌ ఇండియన్‌ సిటిజెన్‌ అవార్డు’, 2009లో ‘టాప్‌ 10 లెజెండ్స్‌ ఆఫ్‌ తమిళ్‌ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్‌’ (ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చర్చ్‌ మేనేజ్‌మెంట్‌) పొందారు. పలు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు అందుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu