‘ఓ ప్రముఖ క్రీడాకారుడు నన్ను వేధించేవాడు’: గుత్తా జ్వాల

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడంతో భారత్‌లో ‘#మీటూ’ ఉద్యమం ఓ ఉప్పెనలా ఎగసిపడుతోంది. అప్పటి నుంచి వివిధ సందర్భాల్లో తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను నటీమణులు, ఇతర రంగాల ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా బయటకు చెప్పుకొంటూ ఉన్నారు. దేశ వ్యాప్తంగా ‘#మీటూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌తోపాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు వివిధ సందర్భాల్లో వేధింపులకు గురయ్యామంటూ బాహాటంగా చెప్పుకొంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా చేరిపోయింది. తన కెరీర్‌ జోరుగా ఉన్న సమయంలో ఓ ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు తనను మానసికంగా వేధించేవాడంటూ ఆమె చేసిన వరుస ట్వీట్లు సంచలనం సృష్టిస్తున్నాయి.

‘ఓ ప్రముఖ క్రీడాకారుడు నన్ను వేధించేవాడు. మానసికంగా వేధించినా అది వేధింపుల కిందకే వస్తుంది. క్రీడల నుంచి తప్పుకోవడానికి అది కూడా ప్రధాన కారణం. ఒకానొక సమయంలో అవి ఎక్కువ కావడంతో నేను అర్ధాంతరంగా క్రీడల నుంచి తప్పుకోవాల్సివచ్చింది. ఆయన నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాడు. వాళ్లపై దాడికి కూడా దిగాడు. నన్ను ఒంటరి దాన్ని చేయాలని ఎంతగానో ప్రయత్నించాడు. ప్రపంచ నెం.9గా ఉన్న నేను ఎంతో క్షోభ అనుభవించాల్సి వచ్చింది’ అని ట్వీట్‌ చేసింది. మరో ట్వీట్‌లో ‘నాకు జాతీయ స్థాయిలో పోటీల్లో స్థానం దక్కకుండా చేసింది కూడా అతడే. కొద్ది రోజుల పాటు నాకు జట్టులో స్థానం లేకుండా చేశాడు’ అంటూ ఆయన పేరు చెప్పకుండా గుత్తా జ్వాల ట్వీట్ చేసింది.