
కొడాలి నాని గురించి ఆయన పనితనం గురించి ఈ రోజు ముచ్చటించుకుందాం. కృష్ణా జిల్లాలోని గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుంచి కొడాలి నాని 2004 నుండి వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యాడు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో బలమైన నాయకుడు. జగన్ గారికి వీర విధేయుడు. కొడాలి నాని వలన వైసీపీకి ప్లస్ ఎంతో మైనస్ కూడా అంతే. గుడివాడ (కేసినో) జూదశాల సమస్య లేకపోతే నాని ఇంకా మంత్రిగానే కొనసాగేవారు. కొడాలి నాని గురించి ఏమని చెప్పాలి ?, ఆయన జుగుప్సాకరంగా మాట్లాడటంలో సిద్ధహస్తుడు అని చెప్పాలా ?. తన పనితనంతో అదినాయకుడి మెప్పు పొందాలి కానీ, హద్దులు దాటి నీచపు మాటలు మాట్లాడి నాయకుడి మెప్పు పొందాలనుకోవటం సరైంది కాదు నాని. దీన్ని సభ్య సమాజం కూడా హర్షించదు. అధికారం ఏ పార్టీకీ శాశ్వతం కాదు అని కొడాలి నాని లాంటి వ్యక్తులకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి ?.
కొడాలి నాని ఆలోచనల్లోనే లోపం ఉందనుకుంటా. ఏపీలోని రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడుతూ.. మన దేశం సింగపూర్ అంత గొప్పది కాదు. అలా కాదు కాబట్టే రోడ్లు ఇలాగే ఉంటాయి అని వాదించడం ఎంత వరకు సమంజసం ?, మంచి రోడ్లు ఆశించడం ఏపీ ప్రజల తప్పా ?, ఒక ప్రజా ప్రతినిధి ఎలా మాట్లాడాలో కూడా కొడాలి నాని ఇంకా తెలుసుకోకపోవడం ఏపీ ప్రజల దురదృష్టం. ముఖ్యంగా ఆయన గారిని గెలిపించిన గుడివాడ ప్రజల అమాయకత్వం అనుకోవాలి. అయినా పదో తరగతి మాత్రమే చదువుకున్న వ్యక్తికీ ఇంతకంటే జ్ఞానం ఎందుకు ఉంటుంది ?. నాని గతం కూడా అంత గొప్పది ఏమీ కాదు. తన 10 తరగతి పూర్తి చేసిన తర్వాత కొడాలి నాని ఓ లారీ డ్రైవర్ కి సహాయకుడిగా, అనంతరం లారీ డ్రైవర్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఎవరో ఆర్థిక సహకారంతో సొంతంగా లారీ రవాణా రంగంలో అడుగుపెట్టాడు. సీనియర్ ఎన్టీఆర్ కు నాని వీరాభిమాని. ఆ అభిమానంతోనే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా పలు ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఈ ప్రక్రియలోనే నందమూరి హరికృష్ణ తో పరిచయం అయింది. నాని జీవితంలో ఇదో పెద్ద మలుపు.
నానికి రాజకీయంగా కలిసి వచ్చింది. హరికృష్ణ తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నాని ని నియమించారు. అనంతర కాలంలో హరికృష్ణ ముఖ్య అనుచరుడిగా వారి కుటుంబ సభ్యులకు కూడా దగ్గరయ్యాడు. హరికృష్ణ ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా భావించే గుడివాడ నియోజకవర్గ టిక్కెట్ ను పొంది 2004లో తొలిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాడు. 2009లో సైతం హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ సహకారంతో టీడీపీ టికెట్ మీద పోటీ చేసి రెండోసారి విజయం సాధించాడు. 2013లో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. అక్కడ నుంచి కొడాలి నాని బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. జగన్ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు – లోకేష్ లను వ్యక్తిగత దూషణలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. ఇక గుడివాడ ప్రజలకు ప్రస్తుతం నాని పై గురి తప్పింది. వచ్చే ఎన్నికల్లో నాని ఓటమి కోసం నాని బంధువులే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గుడివాడ ప్రజల్లో నాని పై వ్యతిరేఖత పెరిగింది. కాబట్టి.. కొడాలి నానికి ఈ సారి గడ్డు కాలమే.













