గెలుపు ధీమాతో ఎవరికి వారే..!

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడ్డానికి మరొక రోజు మాత్రమే గడువుంది. మంగళవారం ఉదయం 10 గంటల కల్లా ట్రెండ్ తెలిసిపోయే అవకాశముంది. రాబోయే ఫలితాలపై ఓవైపు ఉత్కంఠగా ఉన్నా.. మరోవైపు టీఆర్ఎస్, ప్రజాకూటమి పార్టీల నేతలు ఎవరికి వారే ఫలితాల అనంతరం చేయాల్సిన పనులపై కసరత్తు మొదలెట్టేశారు. ప్రజాఫ్రంట్ మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే కీలక సీఎం పదవి కాంగ్రెస్కు దక్కడం లాంఛనమే. ఎవరు గెలిచినా ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజాఫ్రంట్ లో ముందున్న కాంగ్రెస్ సొంతంగానే మేజిక్ ఫిగర్ సాధిస్తుందా.. లేక కూటమితో కలిసి మెజారిటీ సాధిస్తాయా అనే దానిపై మంత్రి పదవుల పంపకం ఉండే అవకాశముంది. టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్ 60 స్థానాలు గెలిస్తే మరోసారి కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. 12-12-18న పంచమి మంచిరోజని ఇప్పటికే కేసీఆర్ ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదేరోజు సీఎంతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

మరోవైపు బీజేపీ మాత్రం తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశముంటుందని లెక్కలేసుకుంటోంది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై పార్టీలోని నేతలు తలో మాట చెబుతున్నారు. కొత్త ప్రభుత్వంలో తాము కీలకమవుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్, మజ్లిస్ భాగస్వామ్యం లేకుండా టీఆర్ఎస్ తో కలిసే విషయంపై ఆలోచిస్తామన్నారు. అయితే అధిష్ఠానం నిర్ణయం బట్టి నడుచుకుంటామని తెలిపారు. అయితే బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి కృష్ణసాగరరావు మాత్రం హంగ్ వస్తే తాము ఏ పార్టీకీ మద్దతివ్వబోమని తెలిపారు. ప్రజా తీర్పును గౌరవించి ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates