జగన్‌ కాన్వాయ్‌కు అడ్డుపడిన మహిళ.. వాహనం ఆపి ఆమెతో మాట్లాడిన జగన్‌

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అల్పాహారం తీసుకున్న తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. ఆసమయంలో పద్మావతి అతిథిగృహం వద్ద కాబోయే సీఎం జగన్‌ కాన్వాయ్‌కు ఓ మహిళ అడ్డుపడింది. తన భర్తకు ఉద్యోగం కావాలంటూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మహిళ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను పక్కకు లాగారు. ఆ పెనుగులాటలో మహిళ చేతికి స్వల్పగాయమైంది. ఇది గమనించిన జగన్‌ వాహనం ఆపి మహిళతో మాట్లాడారు. అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు.