వంశీకి ప్రొడ్యూసర్ దొరుకుతాడా..?

లెజండరీ డైరెక్టర్ వంశీ అంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో పెద్ద పేరు. చాలా మంది హీరోలు ఆయన దర్శకత్వంలో పని చేయాలని ఆస పాడేవారు. వంశీ-ఇళయరాజా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్. ఒకటా, రెండా ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఘనత ఆయన సొంతం. కానీ ఈ మధ్య కాలంలో ఆయన హవా బాగా తగ్గింది. టెక్నాలజీ పెరగడం, కొత్త కొత్త జోనర్లు పుట్టుకు రావడంతో వంశీ సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోయారు. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమా కూడా బోల్తా కొట్టింది. వంశీ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసి ఆయనపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ దెబ్బ నుండి తొందరగానే కోలుకున్నాడు వంశీ.
ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. రచయితగా తన సత్తా చాటుతోన్న సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారని సమాచారం. స్క్రిప్ట్ దాదాపుగా పూర్తయింది. ఓ యంగ్ హీరోతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వంశీకు ఎదురవుతోన్న ఒకే ఒక సమస్య నిర్మాత. వంశీతో సినిమా అంటే ఏ నిర్మాత కూడా సాహసం చేయడంలేదు. మొదట సినిమా చేయాలనుకున్న నిర్మాతలు కూడా ఫ్యాషన్ డిజైనర్ రిజల్ట్ తో వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మాత్రం వంశీ చాలా నమ్మకంగా ఉన్నాడు. సరిగ్గా తీస్తే సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని భావిస్తున్నాడు. మరి ఆ సినిమాను ఎవరు నిర్మిస్తారో.. చూడాలి!