కమల్‌హసన్‌పై నెటిజన్ల మండిపాటు

ప్రముఖ నటుడు కమల్‌హసన్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కులం మతం రహిత సమాజం కావాలంటూ కమల్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. కమల్‌హాసన్ తన ఇద్దరు కూతుళ్లను స్కూల్లో చేర్పించేటప్పుడు వారి కులం, మతం నింపాల్సిన చోట ఖాళీగా వదిలేశారట. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసం పాటు పడాలి. కేరళ ఈ విధానాన్ని అమలు చేస్తోందని, కుల, మత రహిత సమాజం సాధ్యమేనని కమల్ హాసన్ తెలిపారు.

కమల్ ట్వీట్లు చదివిన నెటిజన్లు ఆయన ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ముందుగా తన పిల్లలకు కులం, మతం అంటే ఏమిటో తెలియకుండా పెంచాలని కామెంట్‌ చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కమల్ కూతురు శృతిహాసన్‌ కులం గురించి ఏం మాట్లాడిందో గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. “లుక్‌ హూ ఈజ్ టాకింగ్” అనే షోలో నిరంజన్‌ అయ్యంగార్ అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ బదులిస్తూ నువ్వు అయ్యంగార్‌, నేను అయ్యంగార్‌.. ఇద్దరం సృజనశీలురం, మనల్ని ఎవరూ పెళ్లాడే ఛాన్స్ లేదన్నారు.

ఈ వీడియోను బయటపెట్టిన నెటిజన్లు సంస్కరణలు అంటే ముందు మీ ఇంటి నుంచి ప్రారంభించండి. అప్పుడు మిగతా వారికి చెప్పండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కుల, మత నిర్మూలనకు అంబేద్కర్ పుస్తకాలు చదవాలంటూ సలహాలిస్తున్నారు. తన సినిమాలకు కులాల పేర్లు పెట్టడానికి ఏమాత్రం ఇబ్బంది పడని కమల్‌ రాజకీయాల్లో మాత్రం కులాలకు అతీతుడినని చెప్పుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. “శభాష్ నాయుడు” సినిమా పేరును ఓ ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. రాజకీయాల్లో ద్రావిడ సెంటిమెంట్‌ను వాడుకోవడం కోసం ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.