శ్రీరెడ్డి-నాని ఇష్యూ పై.. స్పందించిన విశాల్‌

టాలీవుడ్‌ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. ఆమె చేసిన ఆందోళనలతో ‘మా’ అసోసియేషన్‌ మహిళా నటీమణుల కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటుచేసింది. కొంతకాలం తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది. అయితే ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2 హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాని పై సోషల్‌ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ద్వారా మళ్లీ వార్తల్లోకెక్కింది శ్రీరెడ్డి. దాంతో ఆగ్రహించిన నాని ఆమెకు లీగల్‌ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఈ వివాదంపై తాజాగా నటుడు విశాల్‌ స్పందించారు. ‘నాకు నాని గురించి తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. వ్యక్తిగత కారణాల వల్ల నేను నానికి మద్దతు తెలపడంలేదు. కానీ నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు అసమంజసంగా ఉన్నాయి. నాని గురించి తెలిసిన వారికి అతను మహిళల పట్ల ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో తెలుసు. ఒకవేళ శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే కేవలం పేర్లు బయటపెడితే సరిపోదు. ఆధారాలు చూపించాలి. ఆమె వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఒకరి తరువాత ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని అర్థమవుతోంది. మున్ముందు నన్ను కూడా టార్గెట్‌ చేస్తుందేమో. కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు అందుకు తగ్గ ఆధారాలు కూడా చూపించాలి. మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధానికి సరైన చట్టాల్లేవు. ఏ మహిళైనా ఇతరులపై ఆరోపణలు చేస్తే చట్టం దానిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఆరోపణలు చేసేవారికే మద్దతు ఇస్తోంది. ఇది సరైనది కాదు’.

‘తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఓ వ్యక్తి తనకు తాను నిర్మాతనని చెప్పుకుని ఆడవాళ్లను ఆడిషన్లకు రమ్మంటాడు. అలా ఆడిషన్ పేరుతో ఆడపిల్లల్ని మోసం చేయడం చాలా తప్పు. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని ఒప్పుకుంటాను. కానీ దాని అర్థం పేరున్న వ్యక్తులను టార్గెట్‌ చేస్తూ వారిపై ఆరోపణలు చేయమని కాదు’ అని వెల్లడించారు విశాల్‌.