HomeTelugu Big Storiesఏపీని దెబ్బతీయాలని కేంద్రం కుట్ర: చంద్రబాబు

ఏపీని దెబ్బతీయాలని కేంద్రం కుట్ర: చంద్రబాబు

కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రానికి అన్యాయం చేసేవారిని వదిలిపెట్టేది లేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సినవన్నీ వడ్డీతో సహా రాబడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.

11 1

అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళుతున్న రాష్ట్రాన్ని కుట్ర రాజకీయాలతో దెబ్బతీయాలని కేంద్రం చూస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేంద్రానికి జనసేన, వైసీపీ సహకరిస్తూ.. రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. పవన్‌కళ్యాణ్‌ ఒకప్పుడు బాగా మాట్లాడేవారని, ఇప్పుడు రూట్‌ మార్చారని, మాట తీరు కూడా మారిందని ఎద్దేవాచేశారు. రూ.75 వేల కోట్ల నిధులు ఇంకా కేంద్రం నుంచి రావాలని నిజ నిర్ధారణ కమిటీ చెబితే పవన్‌ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

ఏపీకి న్యాయం చేస్తారనే ఆశతో బీజేపీతో కలిశామని, 29సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశామని చంద్రబాబు అన్నారు. కేంద్రం మోసం చేస్తోందని గమనించే తాము కేంద్రంతో తెగదెంపులు చేసుకున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పార్లమెంట్‌లో సాహసం చేశారని, ఆంధ్రుల సత్తా చాటారని కొనియాడారు. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి 126 మంది ఎంపీలు సహకరించడం అనేది చరిత్రలో గుర్తుండిపోయే అంశం అని అన్నారు.

అర్హులైన పేదలకు పక్కా గృహాలు కచ్చితంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నిరుద్యోగుల కోసం యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతిని అందించడమే కాకుండా వారికి తాజాగా 10 వేల ఉద్యోగాలు భర్తీచేసేందుకు ప్రణాళిక సిద్ధంచేశామని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు చంద్రన్న బీమా అండగా ఉంటుందని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!