HomeTelugu Big Storiesపొలిటికల్ ట్రెండ్ః ఏపీ జనం ఏమనుకుంటున్నారంటే!

పొలిటికల్ ట్రెండ్ః ఏపీ జనం ఏమనుకుంటున్నారంటే!

ఏ ఎన్నికల సమయంలో అయినా.. ప్రజలు ఏమనుకుంటున్నారు..అనేదే ఫలితాలను శాసిస్తుంది. ఎన్నికల పలితాలపై కుల, మత, డబ్బు, మందు ప్రభావం ఉన్నా… ప్రజలు ఏమనుకుంటున్నారో? అనేదే ఫలితాలను నిర్దేశిస్తుంది. దాన్నే ‘వేవ్’గా అభివర్ణిస్తూ ఉంటారు విశ్లేషకులు. దాదాపుగా ప్రతి ఎన్నికల ముందూ ఏదో ఒక వేవ్ ఉంటుంది. అదెలా ఉంటుందో చరిత్రను పరిశీలిస్తే అర్థం అవుతుంది. గత ఎన్నికల ముందు మోడీ వేవ్ ఉండింది. అదెలా ఉండిందో అర్థం చేసుకోవాలంటే గత లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. అలాంటి మోడీ వేవ్ ఏపీలో చంద్రబాబు లాంటి వాళ్లను కూడా గెలిపించేసింది!

andhra pradesh AP elections 2019

అదీ రాజకీయంలో ప్రజల ఆలోచన సరళికి ఉన్న శక్తి. కాంగ్రెస్ పాలనపై తీవ్రమైన వ్యతిరేకత.. అప్పటికే ప్రజల మధ్యకు వచ్చి గుజరాత్ మోడల్ అని చెప్పిన మోడీకి ఒక ఛాన్స్ ఇద్దామని అప్పుడు ప్రజలు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా వచ్చాయి ఫలితాలు. మరి ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రత్యేకించి ఏపీలో అటు లోక్ సభ, ఇటు ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో… ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏపీలో వేవ్ ఎటు వైపు ఉంది? అనే అంశం గురించి పరిశీలిస్తే..’జగన్ కు ఒక ఛాన్స్’ అనే మాట వినిపిస్తూ ఉంది.

ఐదేళ్లుగా కాదు..తొమ్మిదేళ్లుగా జగన్ జనం మధ్యనే ఉంటున్నారు. రకరకాల యాత్రలు, కార్యక్రమాలు, పార్టీ పనులు.. ఇలా జగన్ గత తొమ్మిదేళ్లలో ఇంట్లో ఉన్న సమయం కంటే రోడ్ల మీద ఉన్న సమయమే చాలా చాలా ఎక్కువ! ఈ క్రమంలో జగన్ తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకున్నాడు. రాష్ట్ర రాజకీయాలపై ప్రతిపక్ష నేతగా జగన్ ముద్ర బలీయంగా కనిపిస్తూ ఉంది. జగన్ విషయంలో వ్యతిరేకులు ఎన్ని విమర్శలు అయినా చేయవచ్చు గాక, ఏమైనా మాట్లాడవచ్చు గాక.. ఇప్పుడు జగన్ అనే ముద్ర ఏపీ ప్రజలపై గట్టిగానే పడింది. పాదయాత్ర అనంతరం దాని విస్తృతి మరింతగా పెరిగింది.

ఇక ఇదే సమయంలో చంద్రబాబు నాయుడుతో ప్రజలు విసిగిపోయారు కూడా. బాబు నుంచి ఈ ఐదేళ్లలో ఆశించింది ఒకటి అయితే జరిగింది మరోటి. అలాంటి బాబుకే పదే పదే వత్తాసు పలకాలని ప్రజలకు కూడా లేదు! చంద్రబాబుకు ఏమీ ఏపీ ప్రజలు బానిసలు కాదు కదా. బాబును రెండు సార్లు ప్రతిపక్ష వాసానికి పరిమితం చేసిందీ అదే ప్రజలు కదా! ఇప్పుడు ఏపీ ప్రజల నుంచి క్షేత్ర స్థాయిలో వినిపిస్తున్న మాట ఒకటే.. ‘జగన్ కు ఒక ఛాన్స్ ఇద్దాం..’ అనేది. ఇది వరకూ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనను ప్రజలు చూశారు. ఆ తర్వాత కాంగ్రెస్ సీఎంల పాలనా చూశారు, మళ్లీ చంద్రబాబు పాలన వచ్చింది. ఇప్పుడు జగన్ కు ఒక అవకాశం ఇవ్వడం గురించి ఏపీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎన్నికల్లో విజయావకాశాల గురించి ఎన్ని వాదోపవాదాలు ఉన్నా.. జగన్ కు ఒక ఛాన్స్ ఇవ్వాలనేది మాత్రం ఏపీ ప్రజల గుండెల నుంచి వినిపిస్తున్న మాట! క్షేత్ర స్థాయిల్లోకి వెళితే ఇది వినిపిస్తుంది!

Recent Articles English

Gallery

Recent Articles Telugu