ఆసక్తికరంగా ‘ఆమె’ ట్రైలర్‌

ప్రముఖ నటి అమలాపాల్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న ‘ఆమె’ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఆమె’. రత్నకుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌పై ప్రశంసల జల్లు కురిసింది.

కాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. దీన్ని అమలాపాల్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘నన్ను ఎంతో ప్రోత్సహించి, ఆదరించిన నా తెలుగు కుటుంబానికి ధన్యవాదాలు. తెలుగు ట్రైలర్‌ ఇదిగో. కాసేపు మీ ప్రపంచాన్ని విడిచి.. కామిని (పాత్ర పేరు) ప్రపంచంలోకి అడుగు పెట్టండి’ అని ట్వీట్‌ చేశారు. ‘బెట్‌ కడతారా?..’ అనే అమలాపాల్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. అలా అనడంతో.. ‘ముందు ఆ బెట్‌ కట్టే అలవాటు వదిలేయ్‌.. అలవాటు పడితే మానడం కష్టం’ అని ఆమె తల్లి మందలిస్తూ కనిపించారు. ఇందులో అమలాపాల్‌ విభిన్నమైన పాత్రలో కనిపించారు. ఆమె ఆలోచనలే.. ఆమెని సమస్యల్లోకి నెట్టినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.