నిర్మాతగా మారిన అమలాపాల్‌

‘మైనా’ చిత్రంలో తన కళ్ల సోయగంతో యువతను ఆకట్టుకున్న నటి అమలాపాల్‌. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా నిర్మాతగానూ మారింది. తన మేనేజరుతో కలిసి ‘క్యాడవర్‌’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ఆమె పెథాలజిస్ట్‌గా నటిస్తోంది. ఈ సినిమా గురించి, నిర్మాతగా చేయడం గురించి ఈ అమ్మడు ముచ్చటిస్తూ ‘మూడేళ్ల క్రితమే ఈ కథను విన్నా. తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాను తెరకెక్కించలేం. అందుకే ఇంత కాలం వేచి చూశాం. అంతేకాకుండా కొత్త దర్శకుడిని నమ్మి పెద్ద బడ్జెట్‌ పెట్టాలా..? అని పలుమార్లు ఆలోచించా. కానీ ఈ సినిమాను వదులుకోవాలని అనిపించ లేదు. ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్న సహ నిర్మాత అజయ్‌తో కలిసి నిర్మిస్తున్నా. ఇంకా పలు సినిమాలను ఇద్దరం కలిసి నిర్మించనున్నాం. ఈ చిత్రానికి అనూప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాక్సాపీసు వద్ద మా తొలి చిత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని నమ్ముతున్నాం. ఇందులో నేను కూడా నటించడం ఆనందంగా ఉంది. పలు కొత్త విషయాలు, సాంకేతిక అంశాలు నిండిన చిత్రంగా ఉంటుంది. లాటిన్‌ భాషలో ‘క్యాడవర్‌’ అంటే శవం అని అర్థం. థ్రిల్లర్‌ సినిమాల అభిమానులకు ఈ చిత్రం విపరీతంగా నచ్చుతుందని’ పేర్కొన్నారు. ఈ సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో నిరాడంబరంగా జరిగింది.