చంద్రబాబు, పవన్‌తో భేటీ అయిన అలీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రముఖ సినీ నటుడు అలీ ఇవాళ కలిశారు. ఉండవెల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో బాబుతో భేటీ అయ్యారు. జన్మభూమి కార్యక్రమానికి చంద్రబాబు వెళ్లే సమయంలో అలీ కొద్దిసేపు మాట్లాడారు. వైసీపీలో ఈనెల 9వ తేదీన అలీ చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇవాళ ఉదయం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో అలీ భేటీ అయ్యారు.

ఈరోజు ఉదయం అలీ విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. జనసేనానితో దాదాపు రెండు గంటలకుపైగా సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి వెళ్లిపోయారు. పవన్-అలీ భేటీలో జనసేన సీనియర్ నేత ముత్తంశెట్టి కృష్ణారావు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అలీ పవన్‌తో భేటీలో తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టులో జగన్‌ను కలిసిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందట. అలాగే వైసీపీలో చేరతారంటూ జరిగిన ప్రచారంపై కూడా చర్చించారట. అంతేకాదు ఈ భేటీపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అలీ రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు.. ఆయన వైసీపీలో చేరకపోవచ్చనే ప్రచారం మొదలయ్యింది. ఇక అలీ జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశారన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అలీ వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరగడం.. ఇప్పుడు జనసేనాని కలవడం ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది. అలీ ఎటువైపు మొగ్గు చూపతారన్నది ఆసక్తి రేపుతోంది. టీడీపీలో చేరతారా.. వైసీపీకి వెళతారా.. లేక జనసేనకు జై కొడతారా అన్నది సస్పెన్స్‌గా మారింది. మరి జనవరి 9న వైసీపీలో చేరతారా లేదా అన్నది క్లారిటీ లేదు. మరి ఈ ఊహాగానాలకు అలీ ఎలా పుల్‌స్టాప్‌ పెడతారో చూడాలి.