అలీ హీరోగా ‘పండుగాడి ఫోటో స్టూడియో’

టాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు అలీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘పండుగాడి ఫోటో స్టూడియో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘వీడు ఫొటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అన్నది ఉపశీర్షిక. గుంటూరు జిల్లా తెనాలిలో శరవేగంగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. పెదరావూరు ఫిల్మ్ స్టూడియో పతాకంపై దిలీప్ రాజా దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ చిత్రానికి తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ తొలి క్లాప్‌ కొట్టగా.. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ముహూర్తపు వేడుకల్లో పాల్గొని యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఇందులో ఆలీకి జోడీగా రిషిత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, జీవ, సుధ, దేవిశ్రీ, చిత్రం శ్రీను, వర్ధమాన నటి టీనా చౌదరి, జబర్దస్ట్ రాము తదితరులు నటిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో ఆలీ మాట్లాడుతూ.. ‘కథ చాలా బాగుంది. కథతో పాటు ఇందులో పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇళయరాజా దగ్గర పనిచేసిన యాజమాన్య సంగీతంలో, బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ పాడిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. చాలా కాలం తర్వాత ఫుల్ కామెడీ సినిమాలో చేస్తున్నాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.’ అన్నారు.