‘మీటూ’పై బిగ్‌ బీ స్పందన ఏమిటంటే!

సెలబ్రిటీల లైంగిక వేధింపులపై ‘మీటూ’ ఉద్యమం పేరుతో బాహాటంగా బాధిత మహిళలు వెల్లడిస్తున్న ఘటనలపై బిగ్‌ బీ అమితాబ్‌ బచన్‌ ఎట్టకేలకు స్పందించారు. గురువారం 76వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న అమితాబ్‌ పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలను ట్విటర్‌ ఖాతాలో అమితాబ్‌ పోస్ట్‌ చేశారు. పనిప్రదేశాల్లో మహిళల పట్ల ఏ ఒక్కరూ దురుసుగా అసభ్యంగా వ్యవహరించరాదని, అలాంటి ఘటనలు ఎదురైతే వాటి గురించి తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని అమితాబ్‌ సూచించారు.

నిందితులపై ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపరమైన చర్యల ద్వారా పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాలన్నారు. సమాజంలో మహిళలు, చిన్నారులు, అణగారిన వర్గాల వారు అణిచివేతకు గురువుతున్న క్రమంలో పాఠశాల స్ధాయి నుంచే నైతిక ప్రవర్తనపై అవగాహన కల్పించాలన్నారు. దేశంలో పలు రంగాల్లో మహిళలు పెద్ద ఎత్తున పనిచేస్తున్న నేపథ్యంలో వారికి భద్రతతో కూడిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

కాగా తనుశ్రీ దతా, నానా పటేకర్‌ ఉదంతంపై ఇటీవల అమితాబ్‌ను ప్రశ్నించగా తాను తనుశ్రీని కాదని, నానా పటేకర్‌ను కూడా కానందున దీనిపై తానేం వ్యాఖ్యానిస్తానని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బిగ్‌ బీ తీరును సోషల్‌ మీడియాలో నెటిజన్లు తప్పుపట్టారు. మరోవైపు తనుశ్రీ సైతం తనకు జరిగిన అన్యాయంపై అమితాబ్‌ నోరుమెదపకపోవడం పట్ల అభ్యంతరం తెలిపారు. సినిమాల్లో అభ్యుదయ భావాలతో ఊదరగొట్టి ప్రేక్షకుల ప్రశంసలు పొందే వారంతా తమ కళ్ల ముందు జరిగే ఘోరాలపై ప్రశ్నలను తప్పించుకోవడం తగదని తనుశ్రీ అన్నారు.