HomeTelugu Reviews'బేబి' మూవీ రివ్యూ

‘బేబి’ మూవీ రివ్యూ

Baby movie review
వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబి’. ‘హృదయ కాలేయం’ దర్శకుడు.. ‘కలర్ ఫొటో’ కథకుడు సాయిరాజేష్ రూపొందించిన చిత్రమిది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం…

వైష్ణవి (వైష్ణవి చైతన్య) స్కూల్ రోజుల్లో తన క్లాస్ మేట్ అయిన ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను చూసి ప్రేమలో పడుతుంది. ముందు ఆ అమ్మాయిని పట్టించుకోని ఆనంద్.. తర్వాత ఆమె తన మీద చూపించే ప్రేమకు లొంగిపోతాడు. ఆనంద్ పదో తరగతి ఫెయిలై ఆటో డ్రైవర్ గా మారితే.. వైష్ణవి మాత్రం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చేరుతుంది. ఇంజినీరింగ్ మొదలు పెట్టే ముందు ఆనంద్ కు ఎక్కడ దూరం అయిపోతానేమో అని బాధ పడుతూ కాలేజీలో అడుగు పెట్టిన ఆమె.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నెమ్మదిగా మారిపోతుంది. తన వేషం సహా వ్యవహారం మార్చేయడంతో పాటు తనను ఇష్టపడే విరాజ్ (విరాజ్ అశ్విన్) పట్ల ఆకర్షితురాలు అవుతుంది. వైష్ణవి ప్రవర్తన నచ్చక ఆమె పట్ల ఆనంద్ దురుసుగా ప్రవర్తిస్తాడు. దీంతో వైష్ణవి అతడికి మరింత దూరమై విరాజ్ కు ఇంకా దగ్గరవుతుంది. మరి ఈ ముక్కోణపు ప్రేమ కథ ఎక్కడిదాకా వెళ్లింది.. చివరికి ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి అన్నది మిగతా కథ.

ఎవర్ గ్రీన్ జానర్‌ల్లో లవ్ స్టోరీ ఒకటి. అయితే ట్రెండ్‌ని బట్టి ప్రతి పదేళ్లకూ ప్రేమకథల రూపం మారిపోతుంటుంది. ఆ జనరేషన్‌లో యూత్‌ ప్రేమ-పెళ్లి-శృంగారం గురించి ఎలా ఆలోచిస్తున్నారు.. ఎలా ప్రవర్తిస్తున్నారు. తదితర అంశాలను ఫాలో అయితే సినిమా హిట్‌ అవుతుంది. ‘బేబి’ కూడా ఈ కోవకు చెందిన సినిమానే. ఇప్పటి యువత అంతా ఇంతే అంటూ అందరినీ ఒక గాటన కట్టేసి.. ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ అంటే ఒక బూటకం అంటూ జనరలైజ్ చేసి చెప్పలేం కానీ.. ప్రస్తుతం పరిణితి లేని వయసులో మొదలయ్యే రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తుంది ‘బేబి’. ఈ సినిమాకి యూత్ తో పాటు ‘యూత్’ ఆలోచనలు ఉన్న వాళ్లందరూ కనెక్ట్‌ అవుతారు.

‘ఆర్ఎక్స్ 100’ సినిమాలానే..’బేబి’లో సాయి రాజేష్ కూడా ఇంచుమించుగా ఇలాంటి లేడీ క్యారెక్టర్ కేంద్రంగానే ఈ కథను నడిపించాడు. ఒక అబ్బాయితో ప్రేమను మొదలుపెట్టి.. మధ్యలో మరో కుర్రాడికి ఆకర్షితురాలై.. మళ్లీ పాత కుర్రాడి వైపే చూసే అమ్మాయి కథ ఇది. ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో వ్యవహారం నడిపేలా అమ్మాయిని లీడ్ క్యారెక్టర్ గా మార్చి తెరపై ప్రెజెంట్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ సొసైటీలో అలాంటి అమ్మాయిలూ ఉన్నారనే హార్ష్ రియాలిటీని చిన్న చిన్న రైడర్స్ పెట్టి కొంచెం బోల్డుగానే చూపించేశాడు సాయిరాజేష్.

దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ‘బేబి’.. మూడు ప్రధాన పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఐతే సీన్లు రొటీన్‌గా అనిపించిన.. పాత్రలు-వాటి మధ్య సన్నివేశాలు ట్రెండీగా ఉండటం.. కాన్వర్జేషన్లు వాస్తవికంగా.. ఆసక్తికరంగా సాగడం వల్ల చాలా వరకు కథనం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా డైలాగులు చాలా రియలిస్టిగ్గా.. ఏమాత్రం నాటకీయత లేకుండా.. యూత్ కు బాగా కనెక్టయ్యేలా ఉండటం పెద్ద ప్లస్. దీనికి తోడు ముఖ్య పాత్రలు పోషించిన ముగ్గురూ ఎవరి స్థాయిలో వాళ్లు చక్కగా నటించడం కూడా ప్లస్ అయింది. స్కూల్ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించి.. కాలేజీ మెట్లెక్కగానే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా హీరోయిన్ పాత్ర ఎలా మారిపోయేందనే క్రమాన్ని ప్రథమార్ధంలో చూపించాడు దర్శకుడు. హీరోయిన్ పాత్రలోని ద్వంద్వ వైఖరిని చాటేలా బోల్డుగా తీసిన ఇంటర్వెల్ సీన్ ప్రథమార్ధానికి హైలైట్.

anand deverakonda Baby Movi

ఇక ద్వితీయార్ధం మొదట్లో దశా దిశా లేనట్లు సాగినా… చివరి 40 నిమిషాల్లో ‘బేబి’ ఊహించని టర్న్ తీసుకుంటుంది. అమ్మాయి గురించి మొదటి అబ్బాయికి నిజం తెలిసిన దగ్గర్నుంచి ‘బేబి’ ఇంటెన్స్ గా సాగుతుంది. ఇద్దరబ్బాయిలు తొలిసారి కలిసిన సన్నివేశం దగ్గర దర్శకుడు తన పనితనం చూపించాడు. కాసేపు ప్రేక్షకులు తెరకు అతుక్కుపోయేలా చేస్తుంది. అక్కడ్నుంచి చివరి వరకు ఒకే టెంపోలో సాగింది ‘బేబి’. పతాక సన్నివేశం అంచనాలకు తగ్గట్లు లేకపోయినా ఓవరాల్ గా సినిమా మీద మంచి ఇంప్రెషనే ఇస్తుంది.

ఈసినిమాలో ఆనంద్ దేవరకొండ తన పాత్రలో జీవించేశాడు. ఈ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడి మనసునూ అతను గెలుస్తాడు. ఇక యూట్యూబర్ టర్న్డ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య తనకు దక్కిన అరుదైన అవకాశాన్ని బాగా వినియోగించుకుంది. హీరోయిన్‌గా తొలి చిత్రంలో ‘ది బెస్ట్ పెర్ఫామెన్స్’ ఇచ్చిన అమ్మాయిల్లో ఒకరిగా తనకు గుర్తింపు వస్తుంది. విరాజ్ అశ్విన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మిగతా.. నటీనటులందరూ తమ పరిధి మేరకు నటించారు. సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి మించి ఉన్నాయి. తెరపై క్వాలిటీ కనిపిస్తుంది. సాయిరాజేష్ డైలాగ్స్‌ కూడా సహజంగా.. ఆసక్తికరంగా సాగాయి.

టైటిల్‌ :బేబీ

నటీనటులు: ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్,వైష్ణవి చైతన్య,నాగబాబు,తదితరులు
దర్శకత్వం: సాయిరాజేష్
నిర్మాత: ఎస్కేఎన్
సంగీతం: విజయ్ బుల్గానిన్

చివరగా: బేబీ.. యూత్‌ని బాగా యాట్రాక్ట్‌ చేస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu