ప్రజలు నాపై పెట్టుకున్ననమ్మకాన్ని వమ్ముచేయాను: జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనపై ప్రజలు పెట్టుకున్ననమ్మకాన్ని వమ్ము చేయబోనని అన్నారు. ప్రతిక్షణం ప్రజల కోసమే ఆలోచిస్తూ వారి సంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నామనీ.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి రాసిన ‘జయహో’ పుస్తకాన్ని ‘ది ప్రింట్‌’ ఎడిటర్‌ శేఖర్‌ గుప్తాతో కలిసి సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలను జగన్‌ గుర్తుచేసుకున్నారు. ఒకే అసెంబ్లీ సెషన్‌లో 19 బిల్లులు ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. 3600 కి.మీల పాదయాత్రను తలచుకుంటే గొప్ప ఉత్తేజం కలుగుతోందని చెప్పారు. పాదయాత్రలో రోడ్డు పక్కన చిన్న టెంటులో పడుకునేవాణ్ని అని.. రోజంతా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉండేవాడినంటూ సీఎం గుర్తుచేసుకున్నారు. ప్రజల నమ్మకం నిలబెట్టేలా సుపరిపాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు, పుస్తక రచయిత కె.రామచంద్రమూర్తి, ఎమెస్కో పుస్తక ప్రచురణ సంస్థ అధినేత విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.