Homeపొలిటికల్AP Politics: తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు నాటకాలు అందుకే అంటున్న చంద్రబాబు

AP Politics: తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు నాటకాలు అందుకే అంటున్న చంద్రబాబు

 

AP Politics

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు కొత్త నాటకాలు ప్రారంభించాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. NDA కూటమికి పడే ఓట్లు చీల్చి మళ్లీ జగన్‌ను అధికారంలోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తాయని మండిపడ్డారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలని సూచించారు. వైఎస్ వివేకా హత్య ఉదంతాన్ని ప్రజల నెత్తిన ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె పోరాటానికి అండగా నిలిచామని.. కానీ ఆమె ఇప్పుడు షర్మిలకు, కాంగ్రెస్‌కు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారని, ఇది రాష్ట్ర ప్రజలకు చేటు తెస్తుందని స్పష్టం చేశారు.

ఒక తల్లి, ఒక కొడుకు, ఒక కూతురు రాష్ట్రంలో డ్రామాలు చేస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి నాటకాలాడుతోందని ధ్వజమెత్తారు. అన్నా చెల్లెళ్ల మధ్య కుటుంబ సమస్య ఉంటే అది కుటుంబంలోనే తేల్చుకోవాలి. అలాకాకుండా ఇలా రాజకీయాల పేరుతో ఐదుకోట్ల మంది జీవితాలను రోడ్లమీదకు తీసుకురావడం సరికాదన్నారు. ప్రజలంతా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు నుంచి ఇదే అంశాన్ని ఎజెండాగా జనంలోకి తీసుకెళ్తాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే ఎన్నికలివి. ప్రజల ఆవేశం తుఫానుగా మారి.. అందులో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. కౌరవుల లాంటి వైసీపీ నేతల వధ తప్పదు. అహంకార దుర్యోధనుడిలా జగన్‌ వ్యవహరిస్తున్నాడంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

తెలుగుదేశం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని, ఏప్రిల్ నెల నుంచే రూ.4 వేల పింఛన్లను అందచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో ప్రజాగళం సభలో పాల్గొన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీలో రావణాసురుడిని అంతం చేసేందుకే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమి కట్టాయని అన్నారు. జగన్‌ ఆయన ఎమ్మెల్యేలు ఏపీని హోల్‌సేల్‌గా దోపిడీ చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియా ద్వారా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని ఆరోపించారు. NDA అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామన్నారు. 100 రోజుల్లో ఏపీ నుంచి గంజాయి, డ్రగ్స్‌, జెబ్రాండ్‌ మద్యాన్ని తరిమేస్తామన్నారు.

తెలుగుదేశం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. పెదకూరపాడులో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘రాముడు దేవుడైనప్పటికీ.. వానరులతో కలిసి పోరాడారు. రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే బీజేపీతో కలిశాం. ఈ దోపిడీ దొంగలు కృష్ణా నది మీదనే రోడ్డు వేశారు. ఇసుకాసురుడిని అంతం చేసి పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తాం. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగాయి. ముస్లింలపై అనేక దాడులు జరిగాయి. ముస్లిం మహిళలు, బాలికలను వైకాపా నేతలు వేధించారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అలాగే ఉంటాయని హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ముస్లింల రక్షణకు నేను హామీ ఇస్తున్నా. జాబు కావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలి అని నినదించారు.

పోలవరం ప్రాజెక్టును 72 శాతం నేను పూర్తి చేశాను. ఈ ఐదేళ్లలో పోలవరం మిగతా పనులు ఏమాత్రం చేయలేకపోయారు. యువత కంటే నా ఆలోచనలు 20 ఏళ్లు ముందుంటాయి. ఆనాడు నేను చేసిన కృషితో ఇవాళ హైదరాబాద్‌ నెంబర్‌ వన్‌గా ఉంది అన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu