ప్రత్యర్థులు ఎంత ఖర్చుపెట్టినా నేను అసెంబ్లీలో అడుగుపెడతా: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అసెంబ్లీలో తాను అడుగుపెట్టి తీరతానని, అవినీతిపరుల భరతం పడతానని అన్నారు. తనను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని ప్రత్యర్థి పార్టీలు గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో కొత్త తరం రాబోతోందని, మార్పు తథ్యమని వ్యాఖ్యానించారు. మంగళవారం విశాఖ జిల్లా ఎలమంచిలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్‌ మాట్లాడారు. అచ్యుతాపురం సెజ్‌ వల్ల నిర్వాసితులైన వారిని ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటర్‌విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని, పరిశ్రమల్లో స్థానికులకే పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. సెజ్‌లలోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జనసేన ప్రభుత్వం వచ్చాక జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు.

విశాఖ జిల్లా చోడవరం, అనకాపల్లి, పెందుర్తిలో పవన్‌ ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. దీంతో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో సభలకు తరలివచ్చిన జనం నిరాశతో వెనుదిరిగారు. జనం బాగా తక్కువగా ఉండటం వల్లే సభలను రద్దు చేసినట్టు సమాచారం.