హాలీవుడ్‌ మూవీకి మురుగదాస్‌ డైలాగ్స్‌ .!

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’కు ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్‌ మురుగదాస్‌ డైలాగులు రాయనున్నారు. యాక్షన్‌ చిత్రాల అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే తమిళ వెర్షన్‌కు మాత్రం మురుగదాస్‌ సంభాషణలు రాయనున్నారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

‘అవెంజర్స్‌’ సిరీస్‌ నుంచి వస్తున్న నాలుగో చిత్రమిది. అయితే తెలుగు, హిందీ వెర్షన్లకు ఎవరు డైలాగులు రాయనున్నారన్నది తెలియాల్సి ఉంది. హాలీవుడ్‌ డైలాగుల కంటే ప్రాంతీయ డైలాగులతో ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారని భావించిన నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారట. మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వస్తున్న 22వ చిత్రమిది. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్‌ ఇవాన్స్‌, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌, స్కార్లెట్‌ జొహాన్సన్‌, మార్క్‌ రఫెలో, జెరెమీ రెన్నర్‌, బెనడిక్ట్‌ కంబర్‌బ్యాచ్‌ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఆంటోనీ రూస్సో, జో రూస్సోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

త్వరలో మురుగదాస్‌.. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.