రాజశేఖర్ సోదరుడిపై దాడి.. ఫిర్యాదు చేసిన జీవితారాజ‌శేఖ‌ర్‌

అక్ర‌మంగా కారును షోరూమ్‌ ముందు పార్కింగ్ చేయ‌డ‌మే కాకుండా ఇదేమ‌ని ప్ర‌శ్నించినందుకు సినీన‌టుడు రాజ‌శేఖ‌ర్ సోద‌రుడు గుణ‌శేఖ‌ర్ వ‌ర‌ద‌రాజ‌న్‌పై గ‌త ఎన్నిక‌ల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పోటీ చేసిన కౌశిక్ రెడ్డి దాడి చేశాడంటూ దర్శకురాలు, సీనీనటి జీవితారాజ‌శేఖ‌ర్‌లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావుకు ఫిర్యాదు చేశారు. కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని ఏసీపీ కోరారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబ‌రు 45లో ఉన్న గుణ డైమండ్స్ ముందు కౌశిక్‌రెడ్డి త‌న కారును నిలిపి వేరే ప్రాంతానికి వెళ్లాడ‌ని, ఇదేమ‌ని గుణ‌శేఖ‌ర్ ప్ర‌శ్నించినందుకు ప్రాంతం పేరుతో దూషిస్తూ ఆయ‌న‌ను తీవ్రంగా కొట్టాడని ఫిర్యాదు పేర్కొన్నారు.

అనంతరం జీవితా రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ..’కౌశిక్‌ దాడి వల్ల గుణశేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. శనివారం నుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పర్మిషన్‌ లేకుండా కారు ఎలా పార్క్‌ చేశారని అడిగితే..రెచ్చిపోయిన కౌశిక్‌ అసభ్య పదజాలంతో దూషిస్తూ గుణశేఖర్‌పై దాడి చేశారు. డైమాండ్‌ షోరూమ్‌ను లేపేస్తానంటూ బెదిరించారు. దాడికి సంబంధించి సీసీ ఫుటేజీలు కూడా ఉన్నాయి. అవి ఏసీపీని ప‌రిశీలించాల‌ని కోరాం. పరిశీలించిన ఏసీపీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేయ‌డానికి వెళ్తున్నాం’ అని చెప్పారు. కాగా దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కౌశిక్‌ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి దగ్గరి బంధువు కావడం గమనార్హం.

CLICK HERE!! For the aha Latest Updates