నిర్మాతపై సెన్సార్ సభ్యుల కామెంట్స్!

ఈ మధ్య సెన్సార్ బోర్డు వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగించడం వారి బాధ్యత. అయితే ఇప్పుడు వారు సినిమాల్లో మాత్రమే కట్స్ చెప్పకుండా.. నిర్మాతలు, వారి వేషధారణపై కూడా కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ సినిమా బాబుమొషాయ్ బందూక్ బజ్ కు సెన్సార్ బోర్డు ఏకంగా 48 కత్తెరలు వేసిన సంగతి తెలిసిందే. కట్ లు చెప్పడమే కాకుండా ఆ చిత్ర నిర్మాత కిరణ్ ష్రఫ్ పై సెన్సార్ సభ్యులు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేశారట. 
నువ్వొక మహిళవి అయినా.. ఇలాంటి సినిమా ఎలా తీశావని సెన్సార్ సభ్యులు ఆమెను ప్రశ్నించారట. మొదట సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి తరువాత 48 కట్స్ చెప్పడంతో.. సినిమా పెద్దల కోసమే అన్నప్పుడు కట్ లు చెప్పడం ఎందుకని మేం వాదించినా వారు పట్టించుకోలేదని నిర్మాత కిరణ్ ష్రఫ్ వాపోయారు. అంతేకాదు.. సెన్సార్ బోర్డులోని ఓ మహిళా సభ్యురాలు మీరు ఆడవారు అయి ఉండి ఇలాంటి సినిమా ఎలా తీశారని ప్రశ్నిస్తుండగా, ఆమెను సపోర్ట్ చేస్తూ మరో సభ్యుడు ప్యాంటు, షర్ట్ వేసుకుంది.. మహిళ ఎలా అవుతుందని విమర్శించాడట. చిత్రనిర్మాతలు ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి రావడం నిజంగా బాధాకరమని ఆమె అన్నారు.