రాజమహేంద్రవరంలో ‘బీసీ గర్జన’: కళా వెంకట్రావు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీను ప్రజలు ఎలా నమ్మాలని ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఆ పార్టీకి కేంద్రంలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఉనికి లేదన్నారు. బీజేపీకు ఓట్లేస్తే వృథా ప్రయాసేనని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం కాకినాడలో జరిగింది. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ.. అక్టోబరు నెలాఖరున తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘బీసీ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఏపీలో కమలం వాడిపోయే దశకు చేరుకుందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసినందుకే బీజేపీను తాము దూరం పెట్టామన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.