
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ కోర్టు డ్రామాలో అందాల భామ రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో గోపీచంద్ లాయర్ గా కనిపించనున్నారు. విడుదలకు సిద్ధం అవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా నుంచి ఇప్పటి వరకూ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభించింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ‘అందాల రాశి’ అనే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో చిత్ర బృందం విడుదల చేసింది. ‘అందాల రాశీ మేకప్ వేసి.. నాకోసం వచ్చేనే.. స్వర్గంలో కేసే నామీద వేసి భూమ్మీద మూసావే..’ అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా కోర్టు థీమ్ తో భారీ సెట్ లో విజువల్ గ్రాండియర్ గా ‘అందాల రాశీ’ పాటను షూట్ చేశారు. ఇందులో రాశీఖన్నా ఎంతో గ్లామరస్ గా కనిపించగా.. గోపీచంద్ హ్యాండ్సమ్ లుక్ తో అదరగొట్టాడు. ప్రధాన జంట కాస్ట్యూమ్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.
జానీ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు. ఇందులో గోపీచంద్ – రాశీ వేసిన సింపుల్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆర్ రవీందర్ దీనికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. సినిమాటోగ్రాఫర్ కరమ్ చావ్లా అద్భుతమైన విజువల్స్ అందించారు. ఎస్బీ ఉద్ధవ్ ఎడిటింగ్ నిర్వహించారు. ఈ పాటకు జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చారు. లిరిసిస్ట్ కె.కె అర్థవంతమైన సాహిత్యం అందించగా.. సాయి చరణ్ భాస్కరుని – రమ్య బెహర కలిసి ఆలపించారు. 2022 జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.













