బిగ్‌బాస్‌: వితికా ఔట్‌

‘బిగ్ బాస్’ చివరికి వచ్చేకొలదీ ఆసక్తికరంగా మారుతోంది. ఇన్నిరోజులూ ఒకరితోఒకరు కలిసి టాస్క్‌లు చేస్తూ సంతోషంగా గడిపిన భార్యభర్తలు వరుణ్ సదేశ్, వితికా షెరు విడిపోయారు. ఈ వారం వితికా ఎలిమినేట్ అయ్యింది. భార్య తనను వదిలిపెట్టి ఇంటిలో నుంచి వెళ్లిపోతుంటే వరుణ్ సందేశ్ ఏడ్చేశాడు. అతన్ని చూసి వితిక కూడా ఏడ్చేసింది. ‘మా ఆయన్ను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ మిగిలిన కంటెస్టెంట్లకు చెప్పి వరుణ్‌కు రెండు ముద్దులిచ్చి బయటకు వచ్చింది వితిక.

‘సండే అంటే ఫన్‌డే’ అంటూ హోస్ట్ అక్కినేని నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.. అస్సలు ఆలస్యం చేయకుండా మన టీవీ ద్వారా ఇంటిలోని కంటెస్టెంట్లను పలకరించారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ల గురించి ప్రేక్షకులకు తెలుసని, అయితే ఒక పాట ద్వారా ఇప్పుడు మీరు మీ గురించి వాళ్లకు చెప్పాలని హౌస్‌మేట్స్‌కి నాగార్జున సూచించారు. కంటెస్టెంట్లు అందరికీ కార్డ్స్ ఇచ్చారు. ఒక్కో కంటెస్టెంట్ ఈ సాంగ్ టాస్క్ చేసిన తరవాత ఆ కార్డులపై మార్కులు వేస్తారు.

అలీతో ఈ టాస్క్‌ను మొదలుపెట్టారు. ‘బిల్లా’ టైటిల్ సాంగ్‌తో తనను తాను పరిచయం చేసుకున్నాడు అలీ. తన స్టైల్లో చాలా సీరియస్‌గా ఈ పాటకు డ్యాన్స్ చేశాడు. ఆ తరవాత శ్రీముఖి.. ‘అనుకోకుండా ఒకరోజు’ సినిమాలోని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని సాంగ్‌కి డ్యాన్స్ చేసింది. అనంతరం వితికా.. ‘అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను’ అనే సాంగ్‌తో తనను తాను పరిచయం చేసుకుంది. ఆ తరవాత రాహుల్.. ‘ఈ పేటకు నేనే మేస్త్రి’ సాంగ్‌తో తనను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు.

ఇక, శివజ్యోతి.. ‘ఒక ఊరిలో’ సినిమాలోని చందమామ నేనే నడిచే బాపు బొమ్మ అనే సాంగ్‌తో తనను పరిచయం చేసుకుంది. ‘ఘర్షణ’ సినిమాలోని రాజాది రాజాది రాజా సాంగ్‌కు వరుణ్ సందేశ్ డ్యాన్స్ చేశాడు. చివరిగా కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్.. ‘జులాయి’ సినిమాలోని టైటిల్ సాంగ్‌తో తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ తరవాత నామినేషన్‌లో ఉన్న ఒకరిని సేఫ్ జోన్‌లో వేశారు నాగార్జున. దీని కోసం పిగ్గీ పాట్‌లను స్టోర్ రూం నుంచి తెప్పించారు. వాటిని పగలకొడితే అందులో సేవ్ అయినవారి పేరు ఉంటుందని నాగార్జున చెప్పారు.

వితికా, వరుణ్ సందేశ్, అలీ రెజా, శివజ్యోతి వరుసగా వారి పిగ్గీ పాట్‌లను పగలగొట్టారు. అయితే, శివజ్యోతి పగలకొట్టిన పాట్‌లో ఆమె పేరు ఉంది. దీంతో ఆమె ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యింది.

కళ్లగంతలాట..
కంటెస్టెంట్ల కళ్లకు గంతలు కట్టి ఒక ప్రత్యేకమైన ఆట ఆడించారు నాగార్జున. మొదట వితికా, వరుణ్ దంపతుల కళ్లకు గంతలు కట్టి వాళ్ల చేతిలో కొన్ని బంతులు పెట్టారు. ఇప్పుడు ఒకరిపై ఒకరిని విసురుకోమని చెప్పారు. వీళ్లిద్దరూ కసితీరా బంతులతో కొట్టేసుకున్నారు. ఆ తరవాత అలీ, రాహుల్‌లకు గంతలు కట్టి చేతులకు బాక్సింగ్ గ్లౌజులు తొడిగారు. ఇక కొట్టుకోమన్నారు. వాళ్లిద్దరూ సరదాగా కొట్టుకున్నట్టు యాక్ట్ చేశారు. అనంతరం శివజ్యోతి ఒక్కరికే టాస్క్ ఇచ్చారు. ఒక గాడిద బొమ్మను బోర్డుపై ఉంచి ఆమె ముందు పెట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని ఆ గాడిద తోకను శివజ్యోతి అతికించాలి. శివజ్యోతి కష్టపడి పెట్టేసింది.

ఇక ఎలిమినేషన్‌ అనంతరం స్టేజ్‌ పైకి వచ్చిన వితికా.. ఇంటిలో తన జర్నీ చూసింది. టీవీ ద్వారా ఇంటి సభ్యులతో మాట్లాడింది. వారిపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక బిగ్‌బాంబ్‌ రాహుల్‌పై విసిరింది. ఈ వారమంతా అన్ని బాత్రుమ్‌లు రాహులే క్లీన్‌ చేయాలి.