ఈశా అంబానీ నిశ్చితార్థం హజరైన ప్రముఖులు

ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ గారాల కూతురు ఈశా అంబానీ, పిరమాల్‌ గ్రూప్స్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ల నిశ్చితార్థం జరగనుంది. ఇటలీలోని అత్యంత విలాసవంతమైన కోమో సరస్సు వద్ద ఉన్న ఓ అతిథి గృహంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ శుభకార్యంలో పాల్గొనేందుకు బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా, ఆమెకు కాబోయే భర్త నిక్‌ జొనాస్, ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా, ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్,‌ నటి సోనమ్‌ కపూర్‌ దంపతులు, జాన్వి కపూర్‌ ఇటలీ చేరుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడ కోమో సరస్సు వద్ద ప్రియాంక, నిక్‌, మనీష్‌, అనిల్‌ తదితరులు దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. కాబోయే దంపతులు ప్రియాంక, నిక్‌ జోడీ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. మనీష్‌ డిజైన్‌ చేసిన చీరలో ప్రియాంక మెరిశారు. వీరితోపాటు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు‌ ఈ వేడుకలో సందడి చేయనున్నారు.

అత్యాధునిక భద్రత, అత్యంత విలాసవంతమైన ప్రదేశంగా పేరొందిన కోమో సరస్సు ప్రాంతంలో ఈశా, ఆనంద్‌ నిశ్చితార్థం జరపాలని అంబానీ-పిరమాల్‌ కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 70ల నాటి కాలంలో ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల బంధానికి బీజం పడింది కూడా ఇక్కడే.