HomeTelugu Reviewsబుచ్చినాయుడు కండ్రిగ మూవీ రివ్యూ

బుచ్చినాయుడు కండ్రిగ మూవీ రివ్యూ

Buchinaidu kandriga thurpu
కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూతబడిన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫాంల ద్వారా చిన్న సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి.. అలరిస్తున్నాయి. ఇప్పటికే ‘భానుమతి & రామకృష్ణ’, ‘జోహార్’ సినిమాలతో సక్సెస్ అందుకున్న ‘ఆహా’.. ఇప్పుడు ‘బుచ్చినాయుడు కండ్రిగ: తూర్పు వీధి…’ సినిమాను ప్రీమియర్ చేసింది.

కథ: ‘బుచ్చినాయుడు కండ్రిగ: తూర్పు వీధి’ అనే గ్రామం. బాలు తన ఎదురింట్లో ఉండే స్వప్నను చిన్నప్పటి నుంచీ ఇష్టపడతాడు. ఆమె లోకంలోనే బతుకుతాడు. కాలేజీకి వెళ్లే వయసులో ఆమెతో ప్రేమలో పడతాడు. స్వప్న కూడా బాలుని ప్రేమిస్తుంది. స్వప్న తండ్రికి కుల పిచ్చి. తమ కులానికి చెందిన పిల్లలతోనే తన కూతురు స్నేహం చేయాలని ఆలోచించే వ్యక్తి. మరోవైపు బాలు తండ్రి తన కొడుకుని రైల్వే స్టేషన్ మాస్టర్ చేయాలని కలలు కంటుంటాడు. కొడుకు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఈ క్రమంలో కూతురి ఇష్టంతో సంబంధం లేకుండా.. బావమరిదితో పెళ్లి ఖాయం చేస్తాడు స్వప్న తండ్రి. దీంతో బాలు, స్వప్న కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. ఆ తరవాత ఏం జరిగింది? పరువు కోసం ప్రాణాలు తీసే స్వప్న తండ్రి ఏం చేశాడు? కొడుకు భవిష్యత్తు కోసం కలలు కనే బాలు తండ్రి ఏం చేశాడు? అనేదే కథ.

Buchinaidu kandriga

నటీనటులు: హీరోహీరోయిన్లు మున్నా, దృశిక చందర్‌తో పాటు ప్రతి ఒక్కరూ చాలా సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నారు. ‘కంచరపాలెం’ సినిమాలో తన నటనతో మెప్పించిన సుబ్బారావు.. ఈ సినిమాలో హీరో తండ్రిగా మంచి నటనను కనబరిచారు. కొడుకుని అమితంగా ప్రేమించే తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ఇక నెగిటివ్ షేడ్స్‌ కనిపించే తండ్రి పాత్రలో ఎప్పటిలానే రవివర్మ అడ్డూరి ఆకట్టుకున్నారు. హీరో మున్నా, హీరోయిన్ దృశిక మంచి నటన కనబరిచారు. ఈ సినిమాలో పాత్రలన్నీ నెల్లూరు
యాసలో మాట్లాడటం మరో హైలైట్‌.

విశ్లేషణ: పరువు కోసం, కులం కోసం కన్న బిడ్డల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని తండ్రులు ఉంటోన్న మన వీధి కథ. ‘బుచ్చినాయుడు కండ్రిగ: తూర్పు వీధి’లో చోటుచేసుకున్న కథ. నిజానికి ఇది మామూలు కథే. ఒక సింపుల్ కథను మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో ఒక అందమైన చిత్రంగా మలచడంలో డైరెక్టర్‌ కృష్ణ పోలూరు పూర్తిగా విజయంసాధించలేకపోయారు.ఈ ఆధునిక సమాజంలో ఇప్పటికీ వెలుగు చూస్తోన్న పరువు హత్యల నేపథ్యాన్ని ఎంపిక చేసుకున్న దర్శకుడు దాన్ని బలంగా
చెప్పలేకపోయారు. కామెడీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయినప్పటికీ, ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాకు బలం. ప్రేక్షకుడితో కంటతడి పెట్టించే ట్విస్ట్ అది. ఈ సినిమాకు ప్రధాన బలం నటీనటులు.

హైలైట్స్‌‌: నటీనటులు
డ్రాబ్యాక్స్: రొటీన్‌ కథ

టైటిల్: ‘బుచ్చినాయుడు కండ్రిగ: తూర్పు వీధి…’
నటీనటులు:మున్నా,దృశిక చందర్,రవివర్మ,సుబ్బారావు,ప్రభావతి,పవిత్ర
దర్శకత్వం: కృష్ణ పోలూరు

చివరిగా : పరువు కన్నా ప్రేమ, ప్రాణం గొప్పది అని చెప్పే కథ
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu