Homeతెలుగు Newsబీజేపీపై విరుచుకుపడ్డ చంద్రబాబు

బీజేపీపై విరుచుకుపడ్డ చంద్రబాబు

9 18దేశభక్తి.. దేశభద్రత గురించి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాఠాలు చెప్పించుకునే స్థితిలో లేనని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పాకిస్థాన్ ప్రధానమంత్రిని తాను విశ్వసిస్తున్నానని …భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నానంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా ఆధారాలు చూపించాలని.. లేకపోతే క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. ఈమేరకు అమిత్‌ షాకు చంద్రబాబు లేఖ రాశారు

పుల్వామా దాడిలో జవాన్ల మృతిని టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నీచ రాజకీయాలకి నిదర్శనమని అన్నారు. బీజేపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఆ బురద మిగిలిన వారికి అంటించాలని చూడటం నీచమని పేర్కొన్నారు. తాము దేశం కోసం మాట్లాడామని.. మీరు రాజకీయం కోసం మాట్లాడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. పుల్వామా ఉగ్రదాడి దుర్ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే జరిగిందన్నారు. 2013లో బిహార్, జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ చేసిన వ్యాఖ్యలు వారికి దేశద్రోహంగా కనిపించలేదా అని నిలదీశారు. పుల్వామా ఉగ్రదాడికి బాధ్యతగా ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించానని.. దానికి ఉలికిపాటు ఎందుకని బీజేపీ నేతలను సీఎం ప్రశ్నించారు. మోడీ మాట్లాడితే దేశభక్తి ఉన్నట్లు.. తాను మాట్లాడితే దేశభక్తి లేనట్లా అని అమిత్‌షాను ప్రశ్నించారు.

రక్తంలో దేశభక్తి ఉంటుందని చెప్పే వాళ్లే రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోళ్ల కుంభకోణం ద్వారా దేశ ప్రతిష్ఠను జాతీయంగా, అంతర్జాతీయంగా దిగజార్చారని సీఎం విమర్శించారు. ప్రతిపక్షాలపై ఈ విధమైన విమర్శలు చేయడం ద్వారా ఆ కుంభకోణాన్ని కప్పి పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తానేమిటో, తన స్వభావం ఏమిటో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా దేశం మొత్తానికి తెలుసునన్నారు. ఇకనైనా బీజేపీ నేతలు తనపై చేస్తున్న అర్థరహితమైన విమర్శలను, దుష్ప్రచారాన్ని కట్టిపెట్టాలని సూచించారు. చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని దేశానికి క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu