Homeతెలుగు Newsకిడారి కుంటుంబానికి రూ.కోటి సాయం అందిస్తాం: చంద్రబాబు.

కిడారి కుంటుంబానికి రూ.కోటి సాయం అందిస్తాం: చంద్రబాబు.

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. అమరావతి నుంచి విమానంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పాడేరు చేరుకున్నారు. కిడారి నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. సర్వేశ్వరరావు కుమారులను అక్కున చేర్చుకున్న చంద్రబాబు.. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

1 29

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గిరిజనులకు ఎనలేని సేవలందించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడం బాధాకరం. ఆయన చనిపోయారన్న విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నా. కిడారి ఆశయాల సాధనకు టీడీపీ కృషి చేస్తుంది. గిరిజనుల్లో ఇంతటి బలమైన రాజకీయ నేత ఉండటం చాలా అరుదు. కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.కోటి సాయం అందిస్తాం. కుటుంబసభ్యుల్లో నలుగురికి రూ.5లక్షల చొప్పున పార్టీ తరపున ఇస్తాం. చిన్న కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం కల్పిస్తాం. మొదటి కుమారుడికి ఏం చేయాలన్న దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆయనకు పార్టీ టిక్కెట్‌ ఇవ్వాలా? వద్దా? అన్నది పార్టీ నిర్ణయిస్తుంది. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి విశాఖ నగరంలో వారికి స్థలం కేటాయిస్తాం. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తాం. బాక్సైట్‌ గనులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఈ ఘటన జరగడం బాధాకరం. వైఎస్‌ హయాంలో కేటాయించిన గనులను మా ప్రభుత్వం రద్దు చేయించింది. ఈ విషయం తెలియని కొందరు అనసవర విమర్శలు చేస్తున్నారు.’

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అరకులోయలోని తన అతిథి గృహం నుంచి ఆదివారం ఉదయం 11.30 గంటలకు గ్రామదర్శినిలో పాల్గొనడం కోసం మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి సరాయి గ్రామానికి బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో డుంబ్రిగుడ మండల కేంద్రాన్ని దాటి లివిటిపుట్టు చేరుకుంటున్న సమయంలో మావోయిస్టులు వారిని అడ్డగించారు. క్వారీ విషయంలో కొద్దిసేపు చర్చించి అనంతరం ఇద్దరినీ కాల్చి చంపారు. ఘటన జరిగిన సమయంలో చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!