HomeTelugu Big Storiesహక్కుల కోసం పోరాడుతున్నాం.. భిక్ష కోసం కాదు.. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పండి

హక్కుల కోసం పోరాడుతున్నాం.. భిక్ష కోసం కాదు.. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పండి

1 11ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. ఏపీకి జరిగిన అన్యాయం కోసమే తాము పోరాడుతున్నామని, కేంద్రం భిక్ష కోసం కాదని చెప్పారు. ‘మూడు రోజుల సమయం ఇస్తున్నా. పార్లమెంట్‌ వేదికగా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఏపీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఏపీ భవన్‌ వేదికగా ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఒక రాష్ట్రం పట్ల వివక్ష చూపినప్పుడు న్యాయం కోసం పోరాడిల్సిందే. పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు మనం పోరాడిల్సిందే. పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకిచ్చిన హామీలు పరిష్కరించలేదు. దీనిపై నిలదీయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు బీజేపీ నేతలే చెప్పారు. వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని అడిగారు. అలాంటిది ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఏపీకి అన్యాయం చేశారు. ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారు. పోలవరం డీపీఆర్‌ను ఆమోదించలేదు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు పరిశ్రమపై అతీగతీ లేదు. రెవెన్యూ లోటు తీర్చలేదు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు.’

‘ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే ఇక్కడ దీక్షకు కూర్చున్నా. కేంద్రం అన్యాయం చేసినందుకే పోరాటం చేస్తున్నాం. పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. హక్కుల కోసం మేం పోరాడుతున్నాం. మీ భిక్ష కోసం పోరాడడం లేదు. మీ ఆటలు సాగవని చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. ఐదు కోట్ల ప్రజల కోసం.. భావితరాల భవిష్యత్తు కోసం.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం. ఆంధ్రభవన్‌ సాక్షిగా ఎన్నో ఉద్యమాలు చేశాం. అవన్నీ కూడా విజయవంతమయ్యాయి. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే తగిన గుణపాఠం చెప్తాం. అద్దె జనాలను పెట్టుకుని రాష్ట్రంపై ప్రధాని మోడీ దాడి చేశారు. కేంద్రం దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. లెక్కలు చెప్పడానికి మేం సిద్ధం. మేం కట్టిన పన్నులకు మీరు లెక్కలు చెప్తారా? ఇప్పటికైనా మూడు రోజుల సమయం ఉంది. చేసింది తప్పని పార్లమెంట్‌లో ఒప్పుకుంటే ఏపీ ప్రజలు క్షమిస్తారు. లేకుంటే శాశ్వతంగా ఈ బీజేపీని, నరేంద్రమోడీని రాష్ట్ర ప్రజలు బహిష్కరిస్తారు. ఏపీ చరిత్రలో మీ పార్టీ అడ్రస్‌ పూర్తిగా గల్లంతు అవుతుంది’ అని చంద్రబాబు హెచ్చరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu