HomeTelugu Big StoriesChandrababu Naidu: కుప్పంలో టీడీపీ కంచుకోటకు బీటలు సాధ్యమేనా?

Chandrababu Naidu: కుప్పంలో టీడీపీ కంచుకోటకు బీటలు సాధ్యమేనా?

kuppam Chandrababu Naidu,TDP,YSRCP,AP politics,kuppamChandrababu Naidu: టీడీపీకి కంచుకోట కుప్పం నియోజకవర్గం. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులకు దగ్గరగా ఉండే నియోజకవర్గం ఇది. ఇప్పటి వరకు వరుసగా ఏడుసార్లు కుప్పం నుంచి చంద్రబాబు విజయం సాధించారు. 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత కుప్పంలో గెలుస్తూ వచ్చారు. అలాంటి చంద్రబాబు కోటను బద్ధలు కొట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కుప్పంలో చంద్రబాబుకు ఝలక్ ఇవ్వాలని వైసీపీ వ్యూహం రచిస్తోంది. అయితే ఇది సాధ్యమయ్యే పనేనా ? తెలుగుదేశం పార్టీ, పసుపు జెండా తప్ప మరో అజెండా ఎరుగని కుప్పం ప్రజలు అధికార పార్టీ ఎత్తులకు చిక్కుతారా వచ్చే ఎన్నికల్లో చూడాల్సిందే.

35 ఏళ్లుగా కుప్పంలో గెలుస్తూ వచ్చిన చంద్రబాబు ఈసారి అక్కడ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. రాష్ట్రంలోనే ఇది అత్యధిక మెజారిటీ కావాలని ఇప్పటికే కుప్పం ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు దిశ-నిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర పరిస్థితి, చంద్రబాబు గెలవాల్సిన పరిస్థితిపై కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కుప్పం నుంచి భారీ మెజారిటీతో గెలిచి నాలుగోసారి సీఎం అవ్వాలని చంద్రబాబు టార్గెట్.

వైనాట్‌ 175 అంటూ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగిన వైసీపీ రాష్ట్రంలో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని, కుప్పంలో వైసీపీ జెండా ఎగరేసి చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. దీనికోసం కుప్పంలో చంద్రబాబుకు ప్రత్యర్థిగా బలమైన యువనేత ఎమ్మెల్సీ భరత్‌ను రంగంలోకి దింపింది. గత 2 ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్ తండ్రి, రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి పోటీ చేశారు. మొత్తం నాలుగు లక్షలకు పైగా జనాభా వున్న కుప్పం నియోజకవర్గంలో సుమారు 2.20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కుప్పంలో బీసీల్లోని వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం ఓటింగ్ ఎక్కువ. దాదాపు 65 వేల నుంచి 70 వేల ఓట్లు ఈ సామాజికవర్గానివే.

kuppam 2 Chandrababu Naidu,TDP,YSRCP,AP politics,kuppam

కుప్పంలో ప్రత్యర్థి ఎవరైనా ఇప్పటి వరకు చంద్రబాబుదే విజయం. వన్నెకుల సామాజిక వర్గానికి చెందిన చంద్రమౌళి 2014, 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రమౌళి కుమారుడు భరత్‌ రంగంలోకి దిగుతున్నాడు. 2014లో కుప్పంలో పోటీ చేసిన చంద్రమౌళికి 55 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 ఎన్నికల్లో సుమారు 70 వేల ఓట్లు సాధించగలిగారు.

కుప్పంలో చంద్రబాబును ఓడించడం అంత సులభం కాదనే విషయం ప్రత్యర్థులకు బాగా తెలుసు. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంతగానో అభివృద్ధి చేశారు. నాలుగు మండలాల్లోని ప్రతి గ్రామంలో విశాలమైన రోడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అధునాతన ప్రభుత్వ భవనాలు కుప్పం సొంతం. ఇజ్రాయిల్ సేద్యం, మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ విధానాలను కుప్పం వాసులకు పరిచయం చేసింది చంద్రబాబే. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు సైతం కుప్పంలో ఉన్నాయి. మూడు నెలలకోసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తారు. ఇప్పుడు కుప్పంలో సొంత ఇంటిని కూడా చంద్రబాబు నిర్మిస్తున్నారు. కుప్పం గ్రామస్థాయి నేతలతోనూ చంద్రబాబుకు నేరుగా సంబంధాలున్నాయి. వారిని పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ఉంది. కుప్పం ప్రజలు చంద్రబాబును తమ సొంత మనిషిగా భావిస్తుంటారు. కుప్పం ఎప్పుడు వచ్చినా తాను ఫుల్ రిఛార్జ్ అవుతానని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారు.

కుప్పంలో చంద్రబాబు కంచుకోటను దెబ్బతీయాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చంద్రబాబు చిరకాల రాజకీయ శత్రువు మంత్రి పెద్దిరెడ్డిని కుప్పంలో రంగంలోకి దింపింది. 30 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంలో ఏమీ అభివృద్ధి చేయలేదంటూ వైసీపీ వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టింది. కుప్పంకు చంద్రబాబు ప్రవేశపెట్టిన విజన్ పక్కన పెట్టాలని, కుప్పంకు ఒక కొత్త విజన్ అనేది అవసరం దానికోసం మేము ప్లాన్ చేస్తున్నామంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. చంద్రబాబును ఓడించలేక పోయినా కుప్పంలో టీడీపీ టార్గెట్‌ లక్ష ఓట్ల మెజారిటీని తగ్గించాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu