సఖ్యత దెబ్బతింటేనే ఇబ్బందులు వస్తాయి.. జగన్‌కి చంద్రబాబు హితవు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తనకు అన్నీ తెలుసు అనుకోవడం మంచి పద్ధతి కాదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరోపించారు. జగన్‌ వయస్సు తన రాజకీయ అనుభవమంత ఉందని ఆయన అన్నారు. ఏపీ బడ్జెట్‌ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో చంద్రబాబు మాట్లాడారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే ఏపీ, తెలంగాణ.. భారత్‌-పాక్ మాదిరిగా మారుతాయని అప్పట్లో జగనే అన్నారు. కానీ, ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని వెనకేసుకొస్తున్నారు. కలిసి ఉన్నప్పుడు బాగుంటుంది.. సఖ్యత దెబ్బతింటేనే ఇబ్బందులు వస్తాయి’ అని అన్నారు.

శాసనసభలో మాట్లాడే ప్రతి అంశాన్ని ప్రజలు చూస్తున్నారన్న చంద్రబాబు.. భావితరాల భవిష్యత్తు తాకట్టు పెట్టే అధికారం ఎవరికీ లేదన్నారు. సభలో తనను మాట్లాడనీయకుండా చేసినప్పటికీ ప్రజలు నిజాలు గ్రహిస్తారని తెలిపారు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని సీఎంకు సూచించారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని గుర్తు చేశారు. ‘సున్నితమైన అంశంపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నాపై చౌకబారు విమర్శలు చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తా. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవద్దని సీఏంకు సూచిస్తున్నా’ అని చంద్రబాబు హితవు పలికారు.