‘కాటమరాయుడు’కి పోటీ తప్పడం లేదు!

సాధారణంగా బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి ముందు తరువాత థియేటర్లలో మరో సినిమా ఉండదు. కాటమరాయుడు విషయంలో కూడా అంతే అనుకున్నారు. రాధ సినిమా వాయిదా పడడంతో ఇక కాటమరాయుడు సోలోగా హిట్ కొట్టేస్తాడని అందరూ భావించారు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. మార్చి 24న కాటమరాయుడుని రిలీజ్ చేస్తుండగా.. సరిగ్గా వారం గ్యాప్ లో మార్చి 31 న మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
అందులో కీలకమైనది వెంకీ నటించిన ‘గురు’ సినిమా. బాక్సింగ్ నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ తో అంచనాలను పెంచేసింది. కాబట్టి ఈ సినిమా కాటమరాయుడుకి పోటీ అనే అనుకోవాలి. చిన్న సినిమా అయినా.. ప్రచార చిత్రంతో హైప్ తెచ్చుకున్న వెంకటాపురం కూడా మార్చి 31నే రిలీజ్ కాబోతుంది. వీటితో పాటు నయనతార నటించిన ‘డోర’ సినిమా కూడా ఆరోజే వస్తోంది. హారర్ జోనర్ లో వస్తోన్న ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే కాటమరాయుడు ఎంత వసూలు చేసిన అది ఫస్ట్ వీక్ మాత్రమే.. ఆ తరువాత థియేటర్లు పంచుకోవడానికి సినిమాలు వచ్చేస్తున్నాయి.