HomeTelugu Trendingభారత్‌లో 6 వేలకు చేరువలో కరోనా బాధితులు

భారత్‌లో 6 వేలకు చేరువలో కరోనా బాధితులు

16 2
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గంట గంటకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశం మొత్తంలో ఇప్పటి వరకు 5,954 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 186 మంది మృతిచెందారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లాక్‌డౌన్‌ను మరికొద్ది రోజులు పొడిగించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించాయి. కరోనాపై తొలి నుంచీ అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తున్న ఒడిశా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెల 30వరకు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విద్యాసంస్థలు జూన్‌ 17వరకూ మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్‌ 30 వరకూ రైలు, విమాన సర్వీసులు కూడా పునరుద్ధరించవద్దని కేంద్ర ప్రభుత్వానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విజ్ఞప్తిచేశారు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో కరోనాబారిన పడినవారి సంఖ్య 1297కు చేరింది. ఇవాళ ఒక్కరోజు 162 మందికి కరోనా సోకింది. ముంబైలో 381 ప్రాంతాలను బీఎంసీ కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో అత్యవసర సర్వీసులు మినహా అన్నిటినీ రద్దు చేసింది.

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కి చేరింది. ఇవాళ కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 11, గుంటూరు 2, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఏపీలో కరోనా బారిన పడి ఆరుగురు మృతిచెందారు. ఇవాళ చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 10కి చేరింది. జిల్లాల వారీగా కర్నూలు 75, గుంటూరు 51, నెల్లూరు 48, ప్రకాశం 38, కృష్ణా 35, కడప 29, ప.గో 22, చిత్తూరు 20, విశాఖ 20, అనంతపురం 13, తూ.గో. 12 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 471కి చేరింది. ఇవాళ కొత్తగా 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 12 మంది కరోనాబారిన పడి మృతిచెందారు. కరోనా నుంచి కోలుకుని 45 మంది డిశ్చార్జి అయ్యారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 167 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటి వరకు 21 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం మరో 60 నుంచి 70 మంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం 665 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 18 మందికే పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu